: మొదటి వరుసలో బాలయ్య!... బ్యాక్ బెంచీలో చలాకీగా నారా లోకేశ్!
తిరుపతిలో నేటి ఉదయం ప్రారంభమైన టీడీపీ వార్షిక వేడుక ‘మహానాడు’లో ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో రెండు రోజులు ముందుగానే తిరుపతి సమీపంలోని తన సొంతూరు నారావారిపల్లెకు చేరుకున్న నారా లోకేశ్... వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇక వేడుక ప్రారంభమయ్యేదాకా అక్కడ కనిపించని ఆయన మామ, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రాంగణానికి చేరుకోగానే అక్కడ ప్రత్యక్షమయ్యారు.
ఇక వేదికపై ఆసీనులయ్యే విషయంలోనూ బాలయ్య, నారా లోకేశ్ లు తమదైన ప్రత్యేకత చాటుకున్నారు. మొదటి వరుసలో ఆసీనులైన బాలయ్య పార్టీ సీనియర్లు కేఈ కృష్ణమూర్తి, కిమిడి కళా వెంకట్రావుల మధ్య కూర్చున్నారు. బిజీ షూటింగ్ ల కారణంగా బాలయ్య కాస్తంత అలసిపోయినట్లు కనిపించారు. ఇక చివరి వరుసలో కూర్చున్న నారా లోకేశ్... పార్టీకి చెందిన యువనేతలతో కలిసి ఉల్లాసంగా కనిపించారు. పార్టీ అధ్యక్షుడి హోదాలో తన తండ్రి చంద్రబాబు చేసిన ప్రారంభోపన్యాసాన్ని ఆయన ఆసక్తిగా విన్నారు.