: ప్రత్యేక హోదా రాదు... సింగపూర్ వంటి అమరావతి కలే: కుండబద్దలు కొట్టిన వెంకయ్య
దేశంలో 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదాను కోరుతున్నాయని, ఏ రాష్ట్రానికి కూడా హోదాను ఇచ్చే పరిస్థితి లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఎన్డీయే పాలన రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోదా రాదని కుండ బద్దలు కొట్టారు. నాడు పార్లమెంటులో హోదా ఐదేళ్లు చాలదని, పదేళ్లు కావాలని అడిగింది తానేనని గుర్తు చేసిన ఆయన, ఇప్పుడు తమ ప్రభుత్వం హోదాను మించిన లాభాన్ని దగ్గర చేసిందని అన్నారు. హోదాతో నిమిత్తం లేకుండానే అభివృద్ధి పనులు చేపడతామని అన్నారు. ఇక సింగపూర్, టోక్యో వంటి నగరాల స్థాయిలో అమరావతిని నిర్మించాలని అనుకోవడం కలేనని వెంకయ్య అన్నారు. రాజధాని అంటే, ఓ సచివాలయం, ఓ అసెంబ్లీ, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగుల నివాసానికి క్వార్టర్లు ఉంటే చాలని, ఆపై అభివద్ధి నిదానంగా సాగుతుందని అన్నారు. 20 ఏళ్లలో హైదరాబాద్ ను మించిన నగరాన్ని నిర్మిస్తామని ప్రజలను మోసం చేసే మాటలు చెప్ప వద్దని తెలుగుదేశం పార్టీకి హితవు పలికారు. 400 ఏళ్లకు పైగా ఘన చరిత్ర ఉన్న హైదరాబాద్ తో అమరావతిని పోల్చవద్దని అన్నారు. అభివృద్ధిని వికేంద్రీకరించాలని, అమరావతిపైనే దృష్టిని సారించరాదని సలహా ఇచ్చారు.