: విజయానందంతో ’భాంగ్రా’ స్టెప్పులేసిన కోహ్లీ, గేల్!... యూట్యూబ్ లో వీడియో హల్ చల్!
ఐపీఎల్ సత్తా చాటుతున్న బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు మొన్న ప్లే ఆఫ్ లో గుజరాత్ లయన్స్ ను చిత్తు చేసి నేరుగా ఫైనల్ చేరింది. దీంతో పట్టరాని సంతోషంతో ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ... సహచరులు క్రిస్ గేల్, మన్ దీప్ సింగ్ తో కలిసి ‘భాంగ్రా’ స్టెప్పులతో దుమ్మురేపాడు. మ్యాచ్ గెలిచిన వెంటనే పార్టీ చేసుకున్న జట్టు ఆటగాళ్లు ఆటపాటలతో చిందులేశారు. మన్ దీప్ సింగ్ సూచనలతో కోహ్లీ, గేల్ ‘భాంగ్రా’ స్టెప్పులేశారు. ఇక చివర్లో మీసాలు మెలేసి తొడ గొట్టిన మన్ దీప్ సింగ్... గేల్ తోనూ విజయ దరహాసం చేయించాడు. ఈ వీడియోను ‘రాయల్స్’ యాజమాన్యం తన వెబ్ సైట్ లో పెట్టింది. ఆ తర్వాత యూట్యూబ్ లోకి చేరిపోయిన ఈ వీడియో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే ఈ వీడియోకు యూట్యూబ్ లో లక్ష హిట్లు వచ్చేశాయి.