: ఆస్ట్రేలియా సిటీమీద దండెత్తిన గబ్బిలాలు...ఎమర్జెన్సీ విధించిన అధికారులు
లక్షలాది గబ్బిలాలు ఒక నగరంపై అకస్మాత్తుగా దండయాత్రకు దిగితే ఎలా ఉంటుంది? బ్యాట్ మ్యాన్ సినిమాల్లో మాత్రమే కనువిందు చేసే ఇలాంటి సన్నివేశం ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ లోని బాటెమన్స్ బే నగరవాసులను ఒక్కసారిగా ఇబ్బందుల్లోకి నెట్టింది. బాటెమన్స్ బేలో చెట్టు, పుట్ట అని తేడా లేకుండా గబ్బిలాలు దాడికి దిగాయి. ప్రతి చెట్టు, ప్రతి ఇంటికి పైకప్పుకు గబ్బిలాలు వేలాడుతూ నగరవాసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. దీంతో బాటెమన్స్ బే వాసులకు అధికారులు పలు హెచ్చరికలు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితి విధించామని, ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రాకూడదని, తలుపులు, కిటికీలు మూసుకొని భద్రంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఫ్లయింగ్ ఫాక్స్ టాస్క్ ఫోర్స్ దళాలు నగరంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన చూళ్లేదని, ఇంత పెద్దసంఖ్యలో గబ్బిలాలు రావడం ఎప్పుడూ జరగలేదని అధికారులు తెలిపారు. అంతరించిపోతున్న ప్రాణుల జాబితాలోని ఈ గబ్బిలాలు లక్షల్లో నగరంపై దాడి చేయడంతో వాటిని చంపలేక, పొగపెట్టి, శబ్దాలు చేస్తూ తరిమేందుకు అధికారులు నానాతిప్పలు పడుతున్నారు.