: మాల్యా అడ్రెస్ కనుక్కోండి!... పోలీసులకు ఎర్రమంజిల్ కోర్టు ఆదేశం
మొత్తం 17 బ్యాంకులకు రూ.9 వేల కోట్ల రుణాలను ఎగవేసి ఎంచక్కా లండన్ చెక్కేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా... బ్యాంకులు, విచారణ సంస్థలతో పాటు కోర్టులకు కూడా చుక్కలు చూపిస్తున్నారు. లండన్ నగర శివారులోని ఓ విలాసవంతమైన భవంతిలో లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తున్న మాల్యా ఇప్పుడప్పుడే భారత్ కు రాలేనని ఏకంగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకే చెప్పేశారు. ఇక తాజాగా తమ ముందు హాజరుకావాలంటూ మాల్యాకు ఎర్రమంజిల్ కోర్టు జారీ చేసిన సమన్లు తిరుగుటపాలో కోర్టుకే వచ్చేశాయి. ఈ నేపథ్యంలో చెక్ బౌన్స్ కేసు విచారణను వచ్చే నెల 6 కు వాయిదా వేసిన కోర్టు... అసలు మాల్యా ఎక్కడున్నాడో కనుక్కోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. తాను జారీ చేసిన సమన్లు వెనక్కు రావడంతో కొత్తగా మరోమారు సమన్లు జారీ చేయాలని కోర్టు నిర్ణయించింది. అయితే ఆ సమన్లను ఏ అడ్రెస్ కు పంపాలన్న విషయాన్ని పోలీసులే చెప్పాలని కోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణ (జూన్ 6వ తేదీ)లోగా మాల్యా ఉంటున్న అడ్రెస్ ను తమకు అందజేయాలని కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.