: ఆ ఎనిమిది మంది ఆటగాళ్ల మధ్యే నేటి కీలక పోరు!
ఐపీఎల్ నాకౌట్ స్టేజ్ కు చేరుకుంది. హేమాహేమీల జట్లు నాకౌట్ కు చేరుకున్నాయి. వాస్తవానికి నేడు జరిగే మ్యాచ్ రెండు జట్లకు అంత ప్రాముఖ్యత కలిగినది కాదు. ఈ మ్యాచ్ లో ఫలితం తల్లకిందులైనా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, రెండో సెమీస్ విజేతతో జరిగే మ్యాచ్ లో విజయం సాధిస్తే టైటిల్ రేసులో తలపడే అవకాశం ఉంది. ఇది ఎలిమినేషన్ పోటీ కాకపోవడంతో రెండు జట్లు విశ్వాసంతో బరిలో దిగే అవకాశం వుంది. రెండు మ్యాచ్ లు ఆడేకంటే ఒకే మ్యాచ్ లో విజయం సాధించి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోవాలని రెండు జట్లు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ఈ మ్యాచ్ కేవలం ఎనిమిది మంది ఆటగాళ్ల మధ్యేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదీ కాకుండా గత మ్యాచ్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టును ఎలా కట్టడి చేయవచ్చో ఢిల్లీ డేర్ డెవిల్స్ చూపించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బలం మొత్తం నలుగురు ఆటగాళ్లే...గేల్, కోహ్లీ, డివిలియర్స్, వాట్సన్. ఈ నలుగురిని పెవిలియన్ కు పంపగలిగితే సగం విజయం సాధించినట్టే. గేల్ ఫాంలో లేడన్న సంగతి తెలిసిందే. పొరపాటున క్లిక్ అయితే తప్ప అతను రాణించే అవకాశాలు లేవు. కోహ్లీ జట్టులో కీలకం, బలహీనతలు తక్కువ కావడంతో ఇతనిని కట్టడం చేయడంపైనే గుజరాత్ విజయావకాశాలు ఉన్నాయి. షార్ట్ పిచ్ బంతులు ఆడడంలో కోహ్లీ కొంత బలహీనమన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కోహ్లీని పెవిలియన్ కు పంపేందుకు రైనా ఎలాంటి వ్యూహాలు రచిస్తాడో చూడాలి. ఇక స్పిన్ ను ఆడడంలో డివిలియర్స్, వాట్సన్ బలహీనం అన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో గుజరాత్ కు నలుగురు ఆకట్టుకునే బౌలర్లు ఉన్నారు. అమిత్ మిశ్రాకు పార్ట్ టైమ్ స్పిన్నర్ స్మిత్ చక్కగా సహకరిస్తున్నాడు. బ్రావో, ఫాల్కనర్ కూడా ఆకట్టుకుంటున్నారు. ఓపెనర్ బ్రెండన్ మెక్ కల్లమ్ రాణిస్తే మిగిలిన పనిని రైనా చేసుకుపోతాడు. ఇంత వరకు సమష్టిగా ఆడిన గుజరాత్ లయన్స్ ఈ మ్యాచ్ లో ఎలా ఆడుతుందనేది ఆసక్తిగొలుపుతోంది. బౌలింగ్ లో ఎవరు ఆకట్టుకుంటే వారే విజయం సాధిస్తారన్నది విశ్లేషకుల మాట. ఈ మ్యాచ్ లో గేల్, కోహ్లీ, డివిలియర్స్, వాట్సన్ తో పాటు మెక్ కల్లమ్, రైనా, అమిత్ మిశ్రా, డ్వెన్ స్మిత్ లలో ఎవరు చెలరేగితే వారినే విజయం వరించే అవకాశం ఉంది.