: ఢిల్లీలో ఎర్టిగా, సియాజ్ ధరలను భారీగా తగ్గించిన మారుతి సుజుకి
ఢిల్లీ సర్కారు తీసుకున్న ఎక్సైజ్ సుంకాల తగ్గింపు లాభాన్ని కస్టమర్లకు అందించాలని నిర్ణయించిన మారుతి సుజుకి, సియాజ్, ఎర్తిగా మోడల్ కార్ల ధరలను భారీగా తగ్గించింది. సియాజ్ ఎస్ హెచ్వీఎస్ (స్మార్ట్ హైబ్రిడ్ వెహికిల్ బై సుజుకి) ధరను రూ. 69 వేలు, ఎర్తిగా ధరను రూ. 62 వేల మేరకు తగ్గించింది. తగ్గిన ధరల తరువాత హోండా సిటీ డీజిల్ వర్షన్ తో పోలిస్తే సియాజ్ రూ. 2.19 లక్షల వరకూ తక్కువ ధరకు లభిస్తుంది. అయితే, ఈ ధరల తగ్గింపుతో సియాజ్ వేరియంట్ ధరలు రూ. 7.68 లక్షల నుంచి (ఎక్స్ షోరూం, న్యూఢిల్లీ) ప్రారంభమవుతాయి. ఇదే సమయంలో ఎర్తిగా ధర రూ. 7.08 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ మోడళ్లు నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ కిందకు రానుండటంతో, వీటి సుంకాలు గణనీయంగా తగ్గాయి. ఇతర నగరాల్లో ధరలు మాత్రం మారలేదని సంస్థ వెల్లడించింది.