: 'స్నేహితులను ఎంచుకోగలం...కుటుంబాన్ని ఎంచుకోలేము' అంటున్న ఉగ్రవాది సోదరుడు!


మనకు స్నేహితులను ఎంచుకునే అవకాశం ఉంది కానీ కుటుంబ సభ్యులను ఎంచుకునే అవకాశం లేదని బెల్జియం అథ్లెట్ మౌరద్‌ తెలిపాడు. స్విట్జర్లాండ్‌ లోని మాంట్రెక్స్‌ లో జరిగిన యురోపియన్‌ తైక్వాండో ఛాంపియన్‌ షిప్‌ లో బెల్జియంకు చెందిన 21 ఏళ్ల మౌరద్‌ బంగారు పతకం సాధించి, రియో ఒలింపిక్స్‌ లో పాల్గొనే అర్హత సాధించాడు. బ్రసెల్స్‌ విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకరైన నజీమ్‌ లాచ్రోయికి మౌరద్‌ సొంత తమ్ముడు కావడం విశేషం. తన సోదరుడి గురించి మౌరద్‌ మాట్లాడుతూ, నజీమ్‌ 2013లో సిరియాకు వెళ్లిపోయాడని, అప్పటి నుంచి అతడిని ఎప్పుడూ కలవలేదని, కనీసం మాట్లాడలేదని అన్నాడు. నజీమ్‌ ఉగ్రవాదిగా ఎందుకు మారాడో తనకు తెలియదని పేర్కొన్నాడు. స్నేహితులను ఎంచుకోగలం కాని, కుటుంబ సభ్యులను ఎంపిక చేసుకునే అవకాశం ఎవరికీ ఉండదని, తన అన్న చేసిన పనులకు తాను బాధ్యుడిని కానని మౌరద్ స్పష్టం చేశాడు. కాగా, బెల్జియం రాజధాని బ్రసెల్స్‌ లో మార్చి 22న ఉగ్రదాడులు జరిగిన సంగతి తెలిసిందే. నజీమ్‌ సహా మరో ఉగ్రవాది ఎయిర్‌ పోర్టులో ఆత్మాహుతి దాడికి పాల్పడగా, మూడో ఉగ్రవాది సమీపంలోని మెట్రోరైలులో తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. గతేడాది నవంబర్‌ లో పారిస్‌ ఉగ్రదాడుల్లోనూ నజీమ్‌ హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News