: ఈఫిల్ టవర్ లో బస చేస్తారా?
ప్రపంచ ప్రసిద్ధ కట్టడం ఈఫిల్ టవర్ ఎక్కేందుకు పర్యాటకులకు అవకాశం ఉంది. అక్కడి నుంచి పారిస్ అందాలను తిలకించి సాయంత్రానికి దిగెయ్యాలి. అలా కాకుండా ఈఫిల్ టవర్ లో హాలిడే ట్రిప్ గడిపే సరికొత్త అవకాశాన్ని అందించేందుకు హోం అవే అనే సంస్థ సిద్ధమవుతోంది. వచ్చేనెల ప్రారంభం కానున్న యూరో కప్ నేపథ్యంలో ఈ సంస్థ ఈ ఆఫర్ ను తెస్తోంది. ఇందుకోసం ఓ పోటీని నిర్వహిస్తోంది. అందులో పాల్గొని విజయం సాధించిన వారికి మాత్రమే ఈ అవకాశం దక్కుతుందని సదరు సంస్థ తెలిపింది. రెంటల్ కంపెనీ అయిన 'హోం అవే' ఈఫిల్ టవర్ లోని 300 అడుగుల ఎత్తులోని మొదటి అంతస్తులో కొంత భాగాన్ని అద్దెకు తీసుకుంది. దానిని తాత్కాలిక నివాసంగా మారుస్తోంది. చక్కని లివింగ్ ఏరియా, పడక గదులు, అన్ని సౌకర్యాలతో నలుగురు ఉండేందుకు సరిపడా సౌకర్యాలు కల్పించనుంది. దానికోసం పోటీ నిర్వహిస్తోంది. అందులో విజయం సాధించిన నలుగురు అదృష్టవంతులకు బస ఏర్పాట్లు చేస్తుంది. యూరో కప్ ను వీక్షించేందుకు పారిస్ వెళ్లే ఎవరైనా ఈ పోటీల్లో పాల్గొనవచ్చు.