: రోడ్డు పక్కన 'బిచ్చగాడి'గా మారిన సోనూ నిగమ్ కథ!


యాంత్రిక జీవనం నుంచి కాస్త దూరంగా వెళ్లి...తానంటే గుర్తింపులేని చోట...ఖరీదైన దుస్తులు, కార్లు, సౌకర్యాలు లేకపోతే తన పరిస్థితి ఏంటి? అన్న ఆలోచనతో చేసిన ఓ ప్రయత్నం మరువలేని అనుభూతులను మిగిల్చిందని ప్రముఖ భారతీయ సినీ నేపథ్యగాయకుడు సోనూ నిగమ్ తెలిపాడు. సంగీతం గొప్పదనాన్ని సాధారణ పౌరులకు పరిచయం చేసేందుకు బీయింగ్‌ ఇండియా అనే డిజిటల్‌ ఛానల్‌ సోషల్‌ ఎక్స్‌పరమెంట్స్‌ చేసింది. ఇందులో భాగంగా 'రోడ్‌ సైడ్‌ ఉస్తాద్‌' పేరుతో సోను నిగమ్‌ వేషభాషలు మార్చింది. నడి రోడ్డుపై బిచ్చగాడిలా పాడేలా చేసింది. ముంబయిలో రద్దీగా ఉండే జుహు ప్రాంతంలో వీధిలో మాసిన జుట్టు, వృద్ధుడి వేషధారణలో చేతిలో హార్మోనియం పెట్టెతో నడిరోడ్డుపై నడుస్తూ వెళ్లి, అనువైన ప్రదేశం చూసుకుని, గాన కచేరీ మొదలు పెట్టాడు. అలా పాడుతున్న సోనూ నిగమ్ ను ఎవరూ గుర్తుపట్టలేదు. అయితే కొంత మంది ఔత్సాహికులు ఆయన గాత్రాన్ని మెచ్చుకుని తోచినంత ఇచ్చారు. ఓ యువకుడు మాత్రం, బిచ్చగాడి వేషధారణలో ఉన్న సోనూ నిగమ్ ను అనుమతి అడిగి, పాటను తన సెల్ ఫోన్ లో రికార్డు చేసుకున్నాడు. అదే యువకుడు సోనూ నిగమ్ లేచి వెళ్లిపోతుండగా, అంకుల్ ఏమైనా తిన్నారా? అని అడిగి, ఓ 12 రూపాయలు ఎవరూ చూడకుండా ఆయన చేతిలో పెట్టాడు. ఈ 12 రూపాయలు తన ప్రతిభకు దక్కిన ప్రతిఫలమని సోనూ నిగమ్ పేర్కొన్నాడు. తాను ఇంత వరకు సంపాదించిన పేరు ప్రతిష్ఠలు ఒక ఎత్తనీ, మానవత్వంతో ఓ యువకుడు ఇచ్చిన 12 రూపాయలు మరో ఎత్తనీ ఆయన అభిప్రాయపడ్డారు. సోనూ నిగమ్ ఆ 12 రూపాయలకు ఫ్రేమ్ కట్టించి ఉంచుకున్నాడు. జీవితంలో ఏదో ఒకరోజు ఆయనను కలుసుకుని...తన గాత్రానికి గుర్తింపు ఇచ్చినందుకు రుణం తీర్చుకుంటానని సోనూ నిగమ్ తెలిపాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News