: ఒకే ఓవర్లో ఆరు సిక్సులు మళ్లీ కొట్టి చూపిస్తా: యువరాజ్ సింగ్
ఒకే ఓవర్లో ఆరు సిక్సులు బాదిన ఫీట్ ను మరోసారి చేసి చూపిస్తానని క్రికెటర్ యువరాజ్ సింగ్ వ్యాఖ్యానించాడు. తన టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్, ప్లే ఆఫ్ కు చేరుకోవడంలో కీలక భూమిక పోషించిన యువరాజ్, గత రాత్రి 7 నుంచి 8 ఏళ్ల వయసులోనే క్యాన్సర్ బారిన పడ్డ 17 మంది చిన్నారులతో మాట్లాడి, వారిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశాడు. ఈ సందర్భంగా ఓ చిన్నారి, మళ్లీ ఆరు సిక్సులు కొట్టగలరా? అని ప్రశ్నించగా, యువరాజ్ సమాధానం ఇచ్చాడు. అప్పట్లో ఆరు సిక్సులు ఎలా కొట్టానో తనకు గుర్తు లేదని, అది జరిగి చాలా సంవత్సరాలైందని వ్యాఖ్యానించిన యూవీ, "మీరు ప్రార్థించండి, నేను మళ్లీ ఆరు సిక్సులు కొట్టి చూపిస్తా" అన్నాడు. 2007లో సౌతాఫ్రికాలో జరిగిన టీ-20 పోరులో ఇంగ్లండ్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ బంతులేస్తున్న వేళ, యువీ ఈ ఫీట్ ను సాధించిన సంగతి తెలిసిందే.