: ఐపీఎల్ లో ప్లే ఆఫ్... మాకు కష్టమే: ఆర్సీబీ
విజృంభించే విరాట్ కోహ్లీ, దంచి కొట్టే క్రిస్ గేల్, బౌలర్లకు చుక్కలు చూపించే ఏబీ డెవిలియర్స్, చిచ్చరపిడుగు సర్ఫరాజ్ ఖాన్... ఇలా ప్రస్తుత ఐపీఎల్ జట్లలో భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్లలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కూడా ఒకటి. అయితే, ఇప్పటివరకూ 10 మ్యాచ్ లు ఆడి నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్ అవకాశాలను అత్యంత సంక్లిష్టం చేసుకుంది. ఆడాల్సిన మ్యాచ్ లు నాలుగుండగా, అన్నింటిలో విజయం సాధిస్తేనే ముందడుగు వేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అది అసాధ్యం కాకపోయినా, అత్యంత క్లిష్టం. ఇక తమకు ప్లే ఆఫ్ చాన్స్ కష్టమేనని జట్టు ఆటగాడు యుజువేంద్ర వివరించాడు. అయితే, తమ ప్రయత్నాన్ని తాము చేస్తామని, నాలుగు మ్యాచ్ లనూ గెలిచేందుకు కృషి చేయనున్నామని అన్నాడు.ఐపీఎల్ పోటీల్లో ఒకరు రాణిస్తే విజయం సాధించడం కష్టమని, అందరూ రాణించాల్సి వుందని చెబుతున్నాడు. కాగా, గత ఐపీఎల్ ఎనిమిది సీజన్లలో బెంగళూరు జట్టు ఒక్కసారి కూడా కప్ కొట్టలేదన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ ప్రారంభానికి ముందు టైటిల్ ఫేవరెట్ జట్లలో ముందు నిలిచిన కోహ్లీ సేన, తొలి రౌండ్ పోటీలు ముగింపు దశకు వచ్చేసరికి కిందకు పడిపోయింది. ఇక నేడు చిన్న స్వామి స్టేడియంలో గుజరాత్ లయన్స్ తో రాయల్ చాలెంజర్స్ పోటీ పడనుంది. ఆడే ప్రతి మ్యాచ్ చాలెంజర్స్ కు చావో రేవో అన్నట్టే. నాలుగు మ్యాచ్ లలో ఏ ఒక్కటి ఓడినా ఇంటికే!