: బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టే అర్హత నాకు లేదు: గంగూలీ
బీసీసీఐకి శశాంక్ మనోహర్ రాజీనామా చేసిన తరువాత బోర్డు అధ్యక్ష పదవి రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో రాజీవ్ శుక్లా, అనురాగ్ ఠాకూర్ పేర్లు ముందున్న విషయం తెలిసిందే. అయితే టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరు కూడా ఆ లిస్టులో చేరడంతో ఆయన తాజాగా స్పందించాడు. ఆ అర్హత తనకు లేదని గంగూలీ వ్యాఖ్యానించాడు. బీసీసీఐ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టే అంశంపై తాను ఆలోచించడం లేదని అన్నాడు. ఆ బాధ్యతలు స్వీకరించడానికి ఎంతో మంది అర్హులు ఉన్నారని చెప్పాడు. అయితే ఆ పదవి ఎవరు చేపడతారో చెప్పడం కష్టమయిన అంశమేనని అన్నాడు. బీసీసీఐ అధ్యక్ష పదవి స్వీకరించాలంటే కనీసం మూడు సార్లు బీసీసీఐ వార్షిక సమావేశాలకు హాజరుకావాల్సి ఉంటుంది. అయితే గంగూలీకి వార్షిక సమావేశాలకు హాజరయ్యే చాన్స్ దక్కలేదు. దీంతో గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవి రేసుకి తాను అర్హుడు కాదని భావిస్తున్నాడు.