: ఏపీకి హోదాపై అటా ఇటా?... తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఆసక్తి!
ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపుతోంది. మరికాసేపట్లో బిల్లు రాజ్యసభ ముందుకు రానుండటంతో, దీనిపై డివిజన్ చేపట్టాలని కాంగ్రెస్ పట్టుబట్టాలని నిర్ణయించింది. ఓటింగ్ కు అనుమతిస్తేనే తాము లోపలికి ప్రవేశిస్తామని చెబుతూ, రాజ్యసభ ప్రారంభానికి ముందే నిరసన చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇప్పటికే ఆ పార్టీ ఎంపీలకు సోనియా విప్ జారీ చేయగా, ఓటింగ్ జరిగిన పక్షంలో బిల్లు తప్పనిసరిగా ఆమోదం పొందుతుందని పరిశీలకులు వ్యాఖ్యానించారు. ఇక తెలుగుదేశం పార్టీ సైతం ఓటింగ్ లో పాల్గొని భాగస్వామ్య ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేయక తప్పనిసరి పరిస్థితి నెలకొంది.
ఒకవేళ సంకీర్ణ ధర్మాన్ని అనుసరించి వ్యతిరేకంగా ఓటేస్తే, రాష్ట్రంలో ఆ పార్టీ తీరని అవమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాదని ఓటేస్తే, అధికార బీజేపీకి దూరమైనట్టు. ఈ పరిస్థితుల్లో చర్చ అనంతరం ఓటింగ్ జరిపితే, దేశం సంకట స్థితిలో పడ్డట్టే. అలా కాకుండా, మూజువాణి ఓటుతో బిల్లు వీగిపోయిందని ప్రకటించే అవకాశం బీజేపీ వద్ద ఉన్నప్పటికీ, అది జరిగితే కూడా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందే. ఎందుకంటే, రాష్ట్రంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది కాబట్టి. ఈ నేపథ్యంలో ప్రైవేటు బిల్లు ఏమవుతుందన్న విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.