: కోచ్, సెక్రటరీల బారి నుంచి తప్పించుకునేందుకు లెస్బియన్లలా ప్రవర్తించేవాళ్లం: 'గేమ్ ఇన్ గేమ్'లో ఫుట్ బాల్ మాజీ కెప్టెన్ సోనా చౌదరి


ఇండియాలో అన్ని క్రీడల్లోనూ మహిళా ఆటగాళ్లపై లైంగిక వేధింపులు సర్వసాధారణమని ఫుట్ బాల్ జట్టు మాజీ కెప్టెన్ సోనా చౌదరి తాను రాసిన 'గేమ్ ఇన్ గేమ్' పుస్తకంలో వెల్లడించారు. క్రీడాకారిణులుగా తామెదుర్కున్న అనుభవాలను పూస గుచ్చినట్టు చెప్పారు. జట్టు మేనేజ్ మెంట్ సభ్యులు, కోచ్, కార్యదర్శిల నుంచి ప్రతి ఒక్కరూ కోరిక తీర్చమని వేధించేవారని, జట్టు కెప్టెన్ గా ఉన్న సమయంలోనూ తనను వేధించారని తెలిపారు. ఇక జట్టులో స్థానం కోసం వచ్చే వారందరినీ తమ కోరికలు తీర్చాలని వీరు డిమాండ్ చేస్తుండేవారని, వారి బారి నుంచి తప్పించుకునేందుకు తాము స్వలింగ సంపర్కులమని చెప్పుకుని, అదే విధంగా వ్యవహరిస్తూ ఉండే వాళ్లమని అన్నారు. రాజీ పడేవాళ్లు కొందరుంటే, రాజీ పడలేక మానసికంగా కుంగి పోతుండేవాళ్లు అత్యధికంగా ఉండేవాళ్లని వాపోయారు. ఇక విదేశీ పర్యటనలకు వెళితే పరిస్థితి మరింత ఘోరంగా ఉండేదని, పురుషుల బెడ్ లను సైతం మహిళా ఆటగాళ్ల గదుల్లో వేయించేవారని గుర్తు చేసుకున్నారు. కాగా, 1998 తరువాత కెరీర్ కు ముగింపు పలికిన సోనా చౌదరి పుస్తకంపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి సరబానంద్ సోనోవాల్ స్పందిస్తూ, ఆరోపణలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి శిక్షిస్తామని వివరించారు.

  • Loading...

More Telugu News