: బాగ్దాద్ మార్కెట్ లో కారు బాంబు పేలుడు... 64 మంది మృతి
ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో ఒక కారు బాంబు పేలిన సంఘటనలో సుమారు 64 మంది మృతి చెందగా, 87 మందికి పైగా గాయపడ్డారు. బాగ్దాద్ లోని షియా ముస్లింలు అధికంగా ఉండే సాద్ర్ లో ఈ రోజు ఈ దారుణ సంఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. బాధితులలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నట్లు ఇరాక్ పోలీసులు, వైద్యాధికారులు వెల్లడించారు. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. కారు బాంబు పేలిన సంఘటనలో సమీపంలోని భవనాలు, వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం, సాద్ర్ సిటీ మార్కెట్ లో కూరగాయలు, పండ్లుతో నిండి ఉన్న ఒక ట్రక్ తో వచ్చిన డ్రైవర్ ఆ వాహనాన్ని జనసమ్మర్థంగా ఉన్న ఈ ప్రాంతంలో పార్క్ చేసి హడావుడిగా వెళ్లిపోయాడన్నారు. ఆ తర్వాత కొద్ది సేపటికి ఈ వాహనం పేలిపోయిందన్నారు. కాగా, ఈ సంఘటనకు తామే బాధ్యులమంటూ ఐఎస్ ఉగ్రవాదులు ఒక ఆన్ లైన్ ప్రకటన చేశారు.