: చర్మంపై ముడతలా..? ఇక చింత అవసరం లేదంటోన్న అమెరికా పరిశోధకులు
చర్మంపై ముడతలు ఏర్పడుతున్నాయని చింతిస్తున్నారా..? ఇక ఆ ఆందోళన అవసరంలేదు. అమెరికాలోని ‘మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’కి చెందిన పరిశోధకులు చర్మంపై ఏర్పడ్డ ముడతలను పోగెట్టే ఆర్టిఫిషియల్ స్కిన్‌ను తయారు చేశారు. ఎటువంటి మందులు వాడే అవసరమే లేకుండా ఈ కృత్రిమ చర్మంతో ఎగ్జిమా వంటి చర్మ వ్యాధికీ చక్కని పరిష్కారం కూడా లభిస్తుందని చెబుతున్నారు. సిలికాన్ ఆధార అణువులతో ఆవిష్కరించిన ఆర్టిఫిషియల్ స్కిన్‌తో వయసు మీద పడినా చర్మానికి యవ్వనత్వాన్ని అందించవచ్చని పేర్కొంటున్నారు. క్రీమ్ రూపంలో ఉండే ఈ ఆర్టిఫిషియల్ స్కిన్‌ను చర్మంపై రాస్తే చర్మం కాంతులీనుతుందని చెబుతున్నారు. అంతేకాదు కళ్ల కింద ఏర్పడే వలయాలకూ ఈ స్కిన్ చక్కటి పరిష్కారం చూపుతుందని తెలిపారు. క్రీమ్ రూపంలో ఉండే ఈ స్కిన్‌ను చర్మంపై రాయడం వల్ల కలుషిత వాతావరణం నుంచి రక్షణ పొందవచ్చని, విష పదార్థాలు చర్మంలోకి వెళ్లడం వంటి సమస్యలను ఎదుర్కోవచ్చని పరిశోధకులు వెల్లడించారు.