: అఫ్రిదీ! క్రికెట్ ఇక నీ ఖిల్లా కాదు!: అబ్దుల్ ఖాదిర్ వ్యాఖ్య
'క్రికెట్ అనేది ఇక ఎంత మాత్రం ఆఫ్రిదీ ఖిల్లా కాదు. ఈ విషయం అతడు గ్రహిస్తే మంచిది'.. ఇలా అని వ్యాఖ్యానించింది ఎవరో కాదు, పాకిస్థాన్ కు చెందిన మాజీ లెగ్ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్. టీ 20 వరల్డ్ కప్ లో అఫ్రిదీ చెత్త ఆటతీరు నేపథ్యంలో ఖాదిర్ ఇలా ఘాటుగా స్పందించాడు. అఫ్రిదీ ఇకనైనా క్రికెట్ కు వీడ్కోలు చెబితే మంచిదని అభిప్రాయపడ్డాడు. అఫ్రిదీ వయసు పెరిగిపోయిందని, క్రికెట్ ఆడేందుకు అతడు ఇక ఏ మాత్రం సరిపోడని వ్యాఖ్యానించాడు. మళ్లీ జట్టులో అవకాశం కోసం చూడడం సరికాదన్నాడు. పనిలో పనిగా ఉమర్ అక్మల్, షెహ్ జాద్ లను కూడా ఖాదిర్ విడిచి పెట్టలేదు. ‘నా దృష్టిలో అహ్మద్ షెహ్ జాద్ క్రికెటర్ కంటే కూడా యాక్టర్ గానే ఎక్కువ. ఇక ఉమర్ అక్మల్ స్వీయ తప్పిదాల వల్లే జట్టులో చోటు కోల్పోయాడు’ అని విమర్శించాడు. ఉమర్ స్వయనా ఖాదిర్ కు అల్లుడు. ఖాదిర్ కుమార్తెనే ఉమర్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కానీ, విమర్శకు వచ్చేసరికి అందరూ సమానమేనని ఖాదిర్ స్పష్టం చేశాడు.