: మరోసారి విద్వేషం వెళ్లగక్కిన ట్రంప్...అది ప్రమాదమన్న హిల్లరీ
విద్వేష వ్యాఖ్యలతో పాప్యులారిటీ సంపాదించుకున్న రియల్ ఎస్టేట్ టైకూన్, అమెరికా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ మరోసారి విద్వేషం వెళ్లగక్కారు. ముస్లింలను అమెరికాలో ప్రవేశించకుండా నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమ వలసదారులను అమెరికా నుంచి బహిష్కరించాలని ఆయన సూచించారు. అదే సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ముస్లిం దేశాలతో కలిసి పని చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలపై డెమొక్రాటిక్ అభ్యర్థి రేసులో ఉన్న హిల్లరీ క్లింటన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అది ప్రమాదకరమైన ధోరణి అని ఆమె హెచ్చరించారు. దీనిని సహించరాదని ఆమె సూచించారు. కాగా, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ అనధికారికంగా ఖాయమయ్యారు. ఆయన ప్రధాన ప్రత్యర్ధి టెడ్ క్రూజ్ అభ్యర్ధిత్వ బరిలోంచి తప్పుకోగా, మరో ప్రత్యర్థి ఒహియో గవర్నర్ కాసిచ్ కూడా తప్పుకున్నారు. దీంతో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా డొనాల్డ్ ట్రంప్ నిలబడడం ఖాయమైంది.