: కేంద్ర మంత్రులు చేతకాని దద్దమ్మల్లా మాట్లాడుతున్నారు: రఘువీరారెడ్డి
బీజేపీ కేంద్ర మంత్రులు దద్దమ్మల్లా మాట్లాడుతున్నారని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మండిపడ్డారు. నీతి ఆయోగ్, 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం ఏపీకి ప్రత్యేకహోదా రాదని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. నీతి ఆయోగ్, ఆర్థిక సంఘాలు ఏం చెబితే అదే జరిగితే ఇక చట్టసభలు ఎందుకని ఆయన నిలదీశారు. ప్రధాని చెప్పినట్టు నీతి ఆయోగ్ వింటుందా? నీతి ఆయోగ్ చెప్పినట్టు ప్రధాని వింటాడా? అని ఆయన అడిగారు. ఇదేదో గుమస్తా చెబితే ఐఏఎస్ అధికారి వినినట్టు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ, బీజేపీ నేతలు ఏపీ ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నారని ఆయన మడిపడ్డారు. 13వ తేదీన ప్రత్యేక హోదాపై రాజ్యసభలో జరిగే కీలకమైన చర్చలో టీడీపీ, బీజేపీల అసలు రంగు తేలిపోతుందని ఆయన చెప్పారు. దేశంలోని ప్రత్యేకహోదా ఉన్న 11 రాష్ట్రాలకు చట్టం ప్రకారం ఇవ్వలేదని, పార్లమెంటు నిర్ణయం ద్వారా ప్రత్యేకహోదా ఇచ్చారని ఆయన తెలిపారు. తాను చెప్పినది తప్పైతే వంద గుంజీలు తీసి క్షమాపణలు చెబుతానని ఆయన చెప్పారు. ఇప్పటికైనా టీడీపీ, బీజేపీలు రాష్ట్ర ప్రయోజనాలకోసం పాటుపడాలని ఆయన సూచించారు. వెంకయ్యనాయుడు ఇప్పుడేం చెబుతారని ఆయన తెలిపారు. టీడీపీ, బీజేపీ నేతలు పెద్దపెద్ద కబుర్లు చెబుతారని, రెండేళ్లలో కేవలం 5శాతం నిధులు మాత్రమే కేంద్రం నుంచి తెచ్చుకోగలిగారని ఆయన ఎద్దేవా చేశారు.