: జాతీయ అవార్డు రూపేణా వచ్చిన నగదు బహుమానాన్ని విరాళంగా ఇచ్చేస్తున్నా: దర్శకుడు క్రిష్
ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ స్థాయిలో ‘కంచె’ సినిమాకు లభించిన ప్రైజ్ మనీని హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా ఇస్తున్నట్లు దర్శకుడు క్రిష్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. తన తల్లితో పాటు ఎందరో క్యాన్సర్ బాధితులకు అత్యాధునిక వైద్య చికిత్స అందిస్తున్న ఈ ఆసుపత్రికి ఆ ప్రైజ్ మనీని ఇస్తున్నానన్నారు. 63వ జాతీయ చలన చిత్రోత్సవాల అవార్డుల ప్రదాన కార్యక్రమం నిన్న ఢిల్లీలో నిర్వహించారు. ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డును రాష్ట్రపతి ప్రణబ్ చేతుల మీదుగా క్రిష్ అందుకున్న విషయం తెలిసిందే. కాగా, ప్రముఖ నటుడు బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’కి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు.