: ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటిమట్టం దారుణంగా పడిపోయింది: దేవినేని ఉమ
విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద ఎన్నడూ లేని విధంగా నీటిమట్టం పడిపోయిందని ఏపీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. కేవలం నాలుగు అడుగులకు నీటిమట్టం పడిపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 6 టీఎంసీల నీటిని వెంటనే విడుదల చేయాలని కృష్ణా బోర్డుకు లేఖ రాశానని, తెలంగాణ మంత్రి హరీష్ రావు ఫోన్ చేసి ఆర్డీఎస్ ప్రాజెక్టుపై చర్చిద్దామన్నారని తెలిపారు. అన్ని ప్రాజెక్టులపై చర్చించేందుకు తాము సిద్ధమని హరీష్ రావుకు చెప్పానని, కేంద్రం అనుమతులు తీసుకుని ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని కోరానని, తెలంగాణలో ప్రాజెక్టుల వల్ల నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా తీవ్రంగా దెబ్బతింటాయనే విషయాన్ని, హైదరాబాద్ కు కూడా తాగునీరు అందించడం కష్టమవుతుందని, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని రైతులు కూడా నష్టపోతారని హరీష్ తో ప్రస్తావించానన్నారు. అన్ని అంశాలను అపెక్స్ కమిటీ ముందు చర్చిద్దామని ప్రతిపాదించినట్లు దేవినేని పేర్కొన్నారు.