: ‘హోదా’ ఇస్తామన్నారుగా!...ఇచ్చేయండి: టీడీపీ ఎంపీ రాయపాటి డిమాండ్


ఏపీకి ప్రత్యేక హోదాపై టీడీపీ నేత, సీనియర్ పార్లమెంటేరియన్, గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు గళం విప్పారు. నేటి ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన సమయంలో అటు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు బీజేపీ నేతలు... ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఇచ్చిన హామీలను ఆయన గుర్తు చేశారు. రాజ్యసభ సాక్షిగా నాడు ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్... ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారని రాయపాటి అన్నారు. ప్రధాని ప్రకటనను స్వాగతించిన బీజేపీ నేతలు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీలు కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారని ఆయన చెప్పారు. పెద్దల సభ సాక్షిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వెంకయ్య, జైట్లీలపై ఉందని రాయపాటి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని పక్షంలో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News