: నేను మేజర్!... అంతా నా ఇష్ట ప్రకారం జరగాల్సిందే!: కేసీఆర్ దత్తపుత్రిక
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఆయన దత్తపుత్రిక ప్రత్యూష వ్యవహారం తలనొప్పిగానే మారిందన్న వాదన వినిపిస్తోంది. తండ్రి, సవతి తల్లి చేతుల్లో చిత్రహింసలకు గురైన ప్రత్యూష తదనంతర పరిణామాల్లో కేసీఆర్ కు దత్తపుత్రికగా మారిన సంగతి తెలిసిందే. కన్న తండ్రి పెట్టిన చిత్రహింసల కారణంగా తీవ్ర గాయాలపాలైన ప్రత్యూషను ఆసుపత్రిలో చేర్పించిన కేసీఆర్... మెరుగైన వైద్యం చేయించారు. ఆ తర్వాత ఆమె ప్రభుత్వ సంరక్షణ కేంద్రానికి చేరింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయిన సందర్భంగా కేసీఆర్... ఆ బాలికను ఇంటికి పిలిపించుకుని భోజనం పెట్టించారు. ఆమె సంరక్షణ బాధ్యతలు తనవేనని ప్రకటించారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన యువకుడు మద్దిలేటి వెంకట్ రెడ్డితో ప్రేమలో పడిన ప్రత్యూష అతడినే పెళ్లి చేసుకుంటానని తన మనసులోని మాటను బయటపెట్టింది. అయితే ప్రత్యూష అభిప్రాయానికి అడ్డుచెప్పిన కేసీఆర్... ఆ యువకుడితో ప్రత్యూష మాట్లాడకుండా కట్టడి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే తనను దత్తత తీసుకున్న కేసీఆర్ మాటకు విలువిచ్చే విషయంలో ప్రత్యూష ససేమిరా అంటోంది. 20 ఏళ్లు నిండిన తాను మేజర్ నని, తన ఇష్ట ప్రకారం తాను కోరుకుంటున్నది చేయాలని ఆమె అధికారులకు తెలిపింది. అంతటితో ఆగని ఆమె ఇదే విషయాన్ని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుకు తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం. వెరసి వరుస పరిణామాలతో ప్రత్యూష అంశం కేసీఆర్ కు తలనొప్పిగా మారిందనే చెప్పాలి.