: తిట్టేసి నాలుక్కరుచుకున్న హర్భజన్...దూసుకెళ్లిన రాయుడు!


క్రికెట్ లో ప్రత్యర్ధి ఆటగాళ్ల మధ్య స్లెడ్జింగ్ చేయడం, రెచ్చగొట్టేలా మీదకు వెళ్లడం సర్వసాధారణం. అదే ఒకే జట్టులో ఆటగాళ్లు పరస్పరం దూసుకెళ్తే...అది చిత్రమే...ఇలాంటి చిత్రం రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ మధ్య చోటుచేసుకుంది. 11వ ఓవర్ 4 వ బంతిని హర్భజన్ సింగ్ సంధించగా, సౌరవ్ తివారీ ఆ బంతిని లాంగ్ ఆఫ్, డీప్ మిడ్ వికెట్ మధ్యనున్న గ్యాప్ నుంచి భారీ షాట్ కొట్టాడు. దానిని ఆపేందుకు రాయుడు దూసుకొచ్చాడు. బంతిని అడ్డుకున్నాడు. అయితే బంతి వేగానికి, రాయుడు వేగం మ్యాచ్ కాకపోవడంతో బంతి రాయుడు చేతిని బలంగా తాకి దూరంగా బౌండరీ లైన్ ను దాటేసింది. దీంతో హర్భజన్ సింగ్ కు కోపం ముంచుకొచ్చింది. చేతికి తగిలిన బంతిని వదిలేశాడంటూ రాయుడిపై అరిచాడు. భారత ఆటగాళ్లు సాధారణంగా ఉపయోగించే ఓ తిట్టు కూడా తిట్టేశాడు. దీంతో రాయుడికి ఒళ్లు మండింది. అంత కష్టపడ్డా బంతి ఆగలేదు సరికదా, భజ్జీ తిట్టు మరింత ఆగ్రహం కలిగించింది. దీంతో డీప్ మిడ్ వికెట్ నుంచి సీరియస్ గా చూస్తూ హర్భజన్ వైపుకు ఎందుకు తిడుతున్నావంటూ దూసుకువచ్చాడు. తరువాత హర్భజన్ అతని వద్దకు వెళ్లి సర్దిచెప్పబోయాడు. దానికి కూడా రాయుడు అంగీకరించలేదు. మరుసటి ఓవర్లో భజ్జీ వికెట్ తీయడంతో రాయుడు అప్పటికి శాంతించి, అతనిని అభినందించాడు. దీంతో ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు. కాగా, ఈ దూకుడు మనస్తత్వం కారణంగానే రాయుడు భారత జట్టులో ఆలస్యంగా చేరాడన్న కామెంట్లు కూడా వున్నాయి.

  • Loading...

More Telugu News