: ‘దిక్సూచి’లో చివరి ప్రయోగం నేడే!...మరికాసేపట్లో నింగిలోకి ఐఆర్ఎన్ఎస్ఎస్ 1జీ

భారతదేశం తన స్వదేశీ నావిగేషన్ కోసం ఉద్దేశించిన చివరి ప్రయోగం మరికాసేపట్లో జరగనుంది. శ్రీ పొట్టిశ్రీరాములు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం ఈ ప్రయోగానికి వేదిక కానుంది. ఇప్పటికే సన్నాహాలు పూర్తి చేసిన ఇస్రో... సరిగ్గా 12.50 గంటలకు ఐఆర్ఎన్ఎస్ఎస్ 1జీని అంతరిక్షంలోకి ప్రయోగించనుంది. ఇప్పటికే ప్రయోగించిన ఆరు ఉపగ్రహాలు దిగ్విజయంగా కక్ష్యలోకి ఎంటరయ్యాయి. ఇక చివరిదైన ఐఆర్ఎన్ఎస్ఎస్ 1జీని ఇస్రో మరికాసేపట్లోనే అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనుంది. ఈ ఉపగ్రహాన్ని వినువీధిలోకి తీసుకెళ్లేందుకు పీఎస్ఎల్వీ సీ-33కి నిన్ననే కౌంట్ డౌన్ ప్రారంభం కాగా... మరికాసేపట్లో ఈ రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లనుంది. స్వదేశీ నావిగేషన్ లో భాగంగా ఇప్పటిదాకా ప్రయోగించిన ఉపగ్రహాలన్నీ విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ఎంటర్ కాగా... నేటి ప్రయోగంలోనూ ఐఆర్ఎన్ఎస్ఎస్ 1జీ తన కక్ష్యలోకి దిగ్విజయంగానే ప్రవేశించి తీరుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇక స్వదేశీ నావిగేషన్ లో చివరిదిగా భావిస్తున్న ఈ ప్రయోగంపై దేశవ్యాప్తంగానూ ఆసక్తి నెలకొంది.

More Telugu News