: 'రెడ్ ఫ్లాగ్' కోసం బహరైన్, ఈజిప్ట్, ఫ్రాన్స్, కెనడా మీదుగా అమెరికా చేరిన 12 భారత యుద్ధ విమానాలు
ప్రతిష్ఠాత్మక 'రెడ్ ఫ్లాగ్' విన్యాసాల్లో పాల్గొనేందుకు ఎస్యూ 30 ఎంకేఐ సహా 12 భారత వాయుసేన యుద్ధ విమానాలు సుదీర్ఘంగా ప్రయాణించి అమెరికా చేరాయి. ఇండియా నుంచి బయలుదేరిన యుద్ధ విమానాలు బహరైన్, ఈజిప్ట్, ఫ్రాన్స్, పోర్చుగల్, కెనడాల మీదుగా అలస్కాలోని ఎలీసన్ ఎయిర్ ఫోర్స్ బేస్ కు చేరుకున్నాయి. నాటో దళాలతో కలసి ఈ విమానాలు 28వ తేదీ నుంచి జరిగే వార్ గేమ్స్ లో పాల్గొననున్నాయి. జాగ్వార్, సుఖోయ్ లకు చెందిన నాలుగేసి విమానాలు, రెండు సీ17 రవాణా విమానాలు, గాల్లోనే ఇంధనాన్ని నింపే ఐఎల్ 78 రీఫ్యూయలర్స్ అమెరికా చేరాయి. 'రెడ్ ఫ్లాగ్' పేరిట జరిగే విన్యాసాల వేడుకలు వచ్చే నెల 13 వరకూ జరగనున్నాయి. అమెరికా నిర్వహించే రెడ్ ఫ్లాగ్ వార్ గేమ్స్ లో ఇండియా పాల్గొనడం ఇది రెండోసారి. 2008లో ఇదే తరహా విన్యాసాల్లో ఇండియా పాల్గొంది.