: ‘తుని’ విధ్వంసకారుల గుర్తింపు... త్వరలోనే అరెస్టులు?
కాపులకు రిజర్వేషన్ల కోసం కాపు ఐక్యవేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తూర్పుగోదావరి జిల్లాలోని తునిలో నిర్వహించిన కాపు గర్జనలో విధ్వంసం చోటుచేసుకుంది. రిజర్వేషన్లపై ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుందామని ముద్రగడ ఇచ్చిన పిలుపుతో అక్కడికొచ్చిన కాపు యువకులు రెచ్చిపోయారు. అటుగా పోతున్న రత్నాచల్ ఎక్స్ ప్రెస్ పై ప్రతాపం చూపారు. రైలుకు నిప్పు పెట్టారు. పోలీసు వాహనాలు, పోలీస్ స్టేషన్లకూ నిప్పు పెట్టారు. ఈ దాడిలో పలువురు పోలీసులు కూడా గాయపడ్డారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ సర్కారు సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. ఆ బాధ్యతలను సీబీసీఐడీకి అప్పగించింది.
రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా, తునిలో కాపు నేతల బస తదితర వివరాలను సమగ్రంగా పరిశీలించి ఎట్టకేలకు హింసకు పాల్పడ్డ నిందితులను గుర్తించారు. ఈ దాడుల వెనుక రాజకీయ నేతలు కూడా ఉన్నారన్న విషయంపైనా స్పష్టమైన ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఈ మేరకు సమగ్ర నివేదికను సీఐడీ ప్రభుత్వానికి అందజేసినట్లు సమాచారం. ఈ నివేదికను పరిశీలించిన మీదట ప్రభుత్వం నిందితుల అరెస్ట్ కు సీఐడీ అధికారులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తుని ఘటనలో విధ్వంసానికి పాల్పడ్డ నిందితులు రేపో, రేపో అరెస్టయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.