: మాల్యాను బలవంతంగా రప్పించడమెందుకు?... కేంద్రం వైఖరిని తప్పుబడుతున్న ఇన్ఫీ మాజీ సీఎఫ్ఓ


17 బ్యాంకులకు రూ.9 వేల కోట్లకు పైగా రుణాలను ఎగవేసిన ప్రముఖ మద్యం వ్యాపారి విజయ్ మాల్యా లండన్ చెక్కేశారు. దేశానికి తిరిగి రావాలని, రుణాలు చెల్లించాలని సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలను మాల్యా బేఖాతరు చేస్తున్నారు. ఆ క్రమంలో ఈ విషయాన్ని కాస్తంత సీరియస్ గా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం... మాల్యాను ఎలాగైనా తిరిగి దేశానికి రప్పిస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా ఇప్పటికే చర్యలు కూడా ప్రారంభించింది. ఈ క్రమంలో ఇన్ఫోసిస్ లో సీఎఫ్ఓగా పనిచేసిన ప్రముఖ ఇన్వెస్టర్ మోహన్ దాస్ పాయ్ నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. మాల్యా విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న వైఖరి సరికాదంటూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ యత్నాలు చట్టం ముందు నిలబడే అవకాశమే లేదని పాయ్ తేల్చేశారు. ప్రభుత్వం తప్పుడు వ్యూహాన్ని అనుసరిస్తోందని ఆయన ఆరోపించారు. నేరుగా డెబిట్ రికవరీ ట్రైబ్యూనల్ ను ఆశ్రయించి... రుణాల కోసం మాల్యా తాకట్టు పెట్టిన ఆస్తుల జప్తునకు ఉత్తర్వులు తెచ్చుకుంటే సరిపోతుందని కూడా ఆయన సూచించారు. మాల్యాపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేస్తున్న మనీ ల్యాండరింగ్ ఆరోపణలు కూడా కోర్టు విచారణల్లో రుజువు కావని ఆయన అన్నారు. తాము ఇచ్చిన రుణాలను మాల్యా విదేశాలకు తరలించారని ఇప్పటిదాకా ఒక్క బ్యాంకు కూడా ఆరోపించలేదన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. బ్యాంకుల రుణాలను ఎగవేసి డిఫాల్టర్లుగా మారిన వారి పేర్లను బయటపెట్టాలన్న కేంద్రం నిర్ణయాన్ని కూడా పాయ్ తప్పుబట్టారు. డబ్బే పోయిన తర్వాత ఇక మానావమానాలు ఏముంటాయని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News