: కోహ్లీ, డివిలియర్స్ దూకుడు ముందు ధోనీ సేన తేలిపోయింది!
బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, డివిలియర్స్ దూకుడు ముందు రెయిజింగ్ పూణే సూపర్ జయింట్స్ బౌలర్లు తేలిపోయారు. కోహ్లీ, డివిలియర్స్ వీర విహారం ముందు ఇద్దరు అశ్విన్ లు, ఇద్దరు శర్మలు, పెరీరా, భాటియా అక్కరకు రాలేకపోయారు. ఒకళ్లు సంప్రదాయబద్ధమైన షాట్లు కొడుతూ దూకుడు ప్రదర్శిస్తే, ఇంకొకరు ప్రయోగాత్మక షాట్లతో పూణే అభిమానులను అలరించారు. ఈ క్రమంలో ఇషాంత్ శర్మ, అంకిత్ శర్మ, మురుగన్ అశ్విన్, రవిచంద్రన్ అశ్విన్, తిసార పెరీరా, ఆర్ భాటియా ధారాళంగా పరుగులిచ్చుకున్నారు. ప్రధానంగా టీమిండియా సీనియర్లు రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మలను కోహ్లీ, డివిలియర్స్ ఆటాడుకున్నారు. వారిద్దరి ఎకానమీని వీరిద్దరూ పెంచేశారు. వీరి దూకుడుకు బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ కోల్పోయి 185 పరుగులు చేసింది. ఇందులో కేఎల్ రాహుల్ కేవలం 7 పరుగులు మాత్రమే చేయగా, మిగిలిన పరుగులన్నీ వీరిద్దరూ చేసినవే. కోహ్లీ 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేయగా, డివిలియర్స్ 6 ఫోర్లు 4 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. పూణే బౌలర్లలో పెరీరా మూడు వికెట్లు తీయడం విశేషం. 186 పరుగుల విజయ లక్ష్యంతో ధోనీ సేన బ్యాటింగ్ ప్రారంభించనుంది.