: బొక్కలిరిసి కుప్పబెడతా!... విపక్ష నేతలకు టీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే వార్నింగ్!
తెలంగాణలోని కరీంనగర్ జిల్లా చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే బొడిగే శోభ నిన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విపక్షాలపై ఒంటికాలిపై లేచిన ఆమె... ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డు వస్తే అంతుచూస్తానంటూ హెచ్చరించారు. తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమక్షంలోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
శోభ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆమె మాటల్లోనే... ‘‘ బెదిరిస్తే పోయెటోళ్లం కాదు. ప్లకార్డులు పట్టుకుని వస్తే... మేం గంగ సోయి లేనోళ్లం కాదు. మేమెంత వర్కు జేస్తున్నమో గీ ప్రజలకు తెలవదా? ఇంకొక్కసారి మేం జేసే కార్యక్రమానికి వస్తే మంచిగుండదు. మా పోలీసులైతే ఏం సేత్తలేరు. ఎందుకంటే ఫ్రెండ్లీ గవర్నమెంటు అన్నం కాబట్టి మా సీఐగారు, మా డీఎస్పీ గారు, మా ఎస్సైలు అంతా నిలబడి సూత్తాండ్రు. బొిక్కలిరిసి కుప్పపెడుత నేనే. ఇక ఊర్కునే సమస్యే లేదు.’’ అని ఆమె వ్యాఖ్యానించారు.
చొప్పదండిలో నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని కుడి చెరువును మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేయాలని కాంగ్రెస్, బీజేపీ నేతలతో పాటు చొప్పదండి గ్రామస్తులు ప్లకార్డులు చేతబట్టి కార్యక్రమానికి హాజరయ్యారు. మంత్రి ఈటల రాజేందర్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆగ్రహావేశాలకు గురైన శోభ... వారిపై విరుచుకుపడ్డారు.