: మహా దారుణం... చిన్నారి ప్రాణం తీసిన గుక్కెడు నీళ్లు!
అది దారుణమైన కరవు పీడిత ప్రాంతంగా మారిన మహారాష్ట్రలోని బీడ్ పరిసర ప్రాంతం. సూర్యుడు 42 డిగ్రీల వేడిని చూపుతూ ఒకవైపు ప్రజలను నానాతంటాలూ పెడుతుంటే, కనీసం తాగేందుకు నీరు లభించని పరిస్థితి నెలకొన్న మరాఠ్వాడాలో భాగమైన ప్రాంతమది. ఈ ప్రాంతంలోని నీటి ఎద్దడి, ఎండవేడిమి అభం శుభం ఎరుగని చిన్నారి ప్రాణాలను బలిగొన్నాయి. ఇంటికి కాసింత నీరు తెచ్చేందుకు అర కిలోమీటరు దూరంలోని పంపు వద్దకు వెళ్లిన 12 ఏళ్ల బాలిక యోగితా దేశాయ్, మార్గమధ్యంలోనే కుప్పకూలింది.
గత కొన్ని రోజులుగా యోగితకు ఆరోగ్యం బాగాలేదట. అయినా ఇంటి నీటి అవసరాలు తీర్చుకునేందుకు ఎండలో బయటకు వెళ్లక తప్పనిసరి పరిస్థితి. రోజుమాదిరిగానే బిందె తీసుకెళ్లిన తమ పాప, ఇక తిరిగి రాదని అనుకుంటేనే గుండెలు పిండేస్తున్నాయని యోగిత తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఎండ వేడికి తోడు హార్ట్ ఎటాక్ కారణంగా బాలిక మృతి చెందిందని డాక్టర్లు వెల్లడించారు. వరుసగా మూడేళ్ల పాటు కరవు బారిన పడ్డ మరాఠ్వాడలో ఇలాంటి యోగితలు మరెందరో!