: నలభై ఏళ్లు పైబడితే... వారంలో 3 రోజులు పనిచేయడం మంచిది!


నలభై సంవత్సరాల వయస్సు పైబడిన ఉద్యోగస్తులు వారంలో మూడు రోజులు పనిచేస్తేనే ఉత్తమ ఫలితాలు సాధిస్తారనే విషయం తాజా అధ్యయనం ద్వారా వెల్లడైంది. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ ఇనిస్టిట్యూట్ వర్కర్ పేపర్ సిరీస్ లో ఈ అధ్యయనానికి సంబంధించిన వ్యాసాన్ని ప్రచురించారు. వారానికి 25 గంటల పాటు పని చేయడం ద్వారా మధ్య వయస్కుల మెదడు పనితీరు మరింత మెరుగుపడుతుంది. అదే కనుక వారంలో 25 గంటలకు పైబడి పని చేస్తే కనుక అలసట, ఒత్తిడి కారణంగా మెరుగైన ఫలితాలు సాధించలేరు. ఈ పరిశోధన నిమిత్తం సుమారు 3,000 మంది పురుషులు, 3,500 మంది మహిళలకు కాగ్నిటివ్ టెస్టు నిర్వహించడం ద్వారా వారి పనితీరును విశ్లేషించారు. వారానికి 25 గంటల పాటు పనిచేసేవారు ఈ పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించారు. అదే, వారానికి 55 గంటలకు పైబడి పనిచేసేవారు మాత్రం పదవీ విరమణ పొందిన, నిరుద్యోగుల కన్నా అథమమైన ఫలితాలను ఈ పరీక్షలో పొందారు. ఈ సందర్భంగా ముగ్గురు వ్యాసకర్తల్లో ఒకరైన కియో యూనివర్శిటీ ప్రొఫెసర్ కొలిన్ ఎంసి కెంజీ మాట్లాడుతూ, మనం పనిచేేసే గంటలపై ఆధారపడి మెదడు చురుకుదనం ఉంటుందన్నారు. ఎక్కువ గంటల పని అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిదని, మెదడు పనితీరు చురుగ్గా ఉండేలా చేస్తుందని, అదేసమయంలో.. అలసట, ఒత్తిడికి కూడా గురవుతామని అన్నారు. మధ్య వయస్కులు, పెద్ద వయస్సు వారు తమ మెదడు పనితీరు చక్కగా ఉండాలంటే వారంలో పని చేసే గంటల విషయంలో ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోక తప్పదని సూచించారు.

  • Loading...

More Telugu News