: ఇక ఎన్నటికీ ఇండియాకు రాని 'కోహినూర్' గురించి ఆసక్తికర విశేషాలు!
కోహినూర్ వజ్రం... భారత గత వైభవానికి చిహ్నం. ఇండియాలో పలువురు రాజుల చేతుల్లో ఓ వెలుగు వెలిగి, ఆపై బ్రిటన్ రాణి కిరీటంలో చేరిపోయిన, అత్యంత ఖరీదైన వజ్రం. ఇక అది ఎప్పటికీ ఇండియాకు రాదు. ఈ వజ్రాన్ని బ్రిటన్ జాతీయులు దొంగిలించలేదని, బలవంతంగా తీసుకెళ్లలేదని చెబుతూ, దాన్ని తిరిగి ఇమ్మని బ్రిటన్ ను కోరబోమని మోదీ సర్కారు సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఇది సగటు భారతీయుడి మనసును ఒకింత నొప్పించినప్పటికీ, దాని గురించిన ఆసక్తికరమైన విశేషాలను మాత్రం తరతరాలకూ చెప్పుకోవచ్చు.
* తెలుగునాట కొల్లూరు గనుల్లో 1300 సంవత్సరానికి పూర్వం ఇది లభించిందన్నది చరిత్రకారుల విశ్వాసం.
* పురాణాల్లో చెప్పిన శమంతక మణి ఇదేనని పలువురి నమ్మకం.
* 1300 సంవత్సరంలో మాల్వా రాజు మహాలక్ దేవ్ వద్ద ఉండగా, మాల్వా రాజును జయించిన అల్లాఉద్దీన్, ధనరాశులన్నింటితో పాటు కోహినూర్ ను సైతం తీసుకెళ్లాడు.
* మరికొందరు చరిత్రకారుల కథనాల ప్రకారం, కాకతీయ చక్రవర్తి ప్రతాప రుద్రుడి ఖజానాలో ఇది కొంత కాలం ఉంది. 1310లో ఢిల్లీ సుల్తానుతో సంధి చేసుకున్న ఆయన, ఈ వజ్రాన్ని సమర్పించుకున్నాడు.
* ఆపై ఢిల్లీ రాజుల వద్ద ఉన్న వజ్రం, మొదటి పానిపట్టు యుద్ధం తరువాత బాబర్ చేతికి అందింది.
* 1530న రాసిన అక్బర్ నామాలో దీని ప్రస్తావన ఉంది. తనకు అత్యంత ప్రియమైన వజ్రమని చెప్పాడు కూడా.
* దీని విలువ ప్రపంచమంతా ఒక రోజు చేసే ఖర్చులో సగం ఉంటుందని ఆయన తెలిపారు.
* వజ్రానికి కోహినూర్ అన్న పేరు ఎలా వచ్చిందంటే... మహమ్మద్ షా ఎప్పుడూ ఈ వజ్రాన్ని తన తలపాగాలో దాచుకుంటాడన్న విషయాన్ని తెలుసుకున్న నాదిర్ షా, ఆయన్ను విందుకు పిలిపించి, తలపాగాలు మార్చుకుందామన్న ప్రతిపాదన పెట్టాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మహమ్మద్ షా తలపాగాతో పాటు వజ్రాన్ని నాదిర్ షా కు ఇవ్వగా, వజ్రాన్ని చూసిన ఆయన 'కోహ్ - ఇ - నూర్' (కాంతి శిఖరం) అన్నాడట. దాంతో వజ్రానికి ఆ పేరు ఖరారైంది.
* ఆపై వజ్రం పలు చేతులు మారుతూ పంజాబ్ పాలకుల వద్దకు చేరింది.
* 1849లో జరిగిన సిక్కు యుధ్ధంలో ఓటమి పాలైన మహరాజా రంజిత్ సింగ్ దీన్ని ఈస్టిండియా కంపెనీకి సమర్పించుకున్నారు.
* ఆపై ఇది బ్రిటన్ రాణి విక్టోరియా వద్దకు చేరిపోయింది.
* ఆపై వజ్రానికి సాన బట్టించిన రాణి తన కిరీటంలో పొదిగించుకుంది.
* విక్టోరియా తరువాత అలెగ్జాండ్రా, మేరీ, ఎలిజబెత్ రాణులు దీన్ని ధరించారు.
* బ్రిటన్ రాజ కుటుంబంలో పెద్ద కోడలికి ఈ వజ్రం కానుకగా వస్తోంది.
* ఈ వజ్రం పురుషుల వద్ద ఉంటే, వారు నష్టపోయారని, మహిళల వద్ద ఉంటే వారిని అదృష్టం వరించిందని చరిత్ర చెబుతోంది.
* దీన్ని తిరిగి ఇవ్వాలని 1947లో ఒకసారి, 1953లో మరోసారి ఇండియా కోరినా బ్రిటన్ స్పందించలేదు.
* ఆపై 2000 సంవత్సరంలో పలువురు ఎంపీలు వజ్రం కోసం క్లయిమ్ చేయగా, బ్రిటన్ అధికారులు దీన్ని తిరిగిచ్చేది లేదని స్పష్టం చేశారు.
* వాస్తవానికి ఈ వజ్రం అసలు యజమాని ఇండియాయే అని ఇప్పటికీ చెప్పుకోలేని పరిస్థితి ఇండియాది.
* అవిభాజ్య భారతావని నుంచి తరలివెళ్లిన ఈ వజ్రం, ఒకవేళ తిరిగి ఇండియాకు చేరితే, దీనిలో భాగం ఇవ్వాలని పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్ దేశాల నుంచి డిమాండ్ వస్తుందన్నది నిజం.
* ప్రస్తుతం ఇది బ్రిటన్ మ్యూజియంలో వేలాది అపురూప కళాఖండాలు, విలువైన వజ్రాల మధ్య ఇప్పటికీ చూపరులను ఆకర్షిస్తోంది.
* తాము వివిధ దేశాల నుంచి తెచ్చిన విలువైన వస్తువులను తిరిగి ఆ దేశాలకే ఇచ్చేస్తే, తమ మ్యూజియంలో ఒక్క వస్తువు కూడా ఉండదన్నది బ్రిటన్ ప్రధాని డేవిడ్ కెమెరాన్ వాదన.
ఇక ఏతావాతా ఇండియాకున్న ఆశ ఏంటంటే... భవిష్యత్తులో ఏనాటికైనా, ఇండియా సూపర్ పవర్ గా ఎదిగి, ఆపాటికి బ్రిటన్ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుని కుదేలై ఉంటే, అప్పుడు ఈ వజ్రం తిరిగి ఇండియాకు వస్తుందేమో!