: ఆనాడు రూ. 7,200కు అమ్మిన 'యాపిల్' వాటా విలువ నేడు రూ. 4.19 లక్షల కోట్లు!
యాపిల్... ప్రపంచ టెక్ దిగ్గజాల్లో ఒకటి. స్టీవ్ జాబ్స్... యాపిల్ వ్యవస్థాపకుడిగా అందరికీ పరిచితమైన పేరు. స్టీవ్ వోజ్నియాక్... యాపిల్ సహ వ్యవస్థాపకుడిగా ఇతని పేరునూ వినే ఉంటారు. మరి మీకు రొనాల్డ్ వైనీ గురించి తెలుసా? అది తెలియాలంటే 40 సంవత్సరాల వెనక్కి వెళ్లాలి. రొనాల్డ్, యాపిల్ సంస్థను స్థాపించిన వ్యవస్థాపకుల్లో మూడవ వ్యక్తి. ఇతనికి సంస్థలో 10 శాతం వాటా ఉంది. యాపిల్ సంస్థ ఏప్రిల్ 1, 1976న ప్రారంభం కాగా, ఆపై రెండు వారాల వ్యవధిలోనే, అంటే 12వ తేదీన, తాను మీతో కలిసుండలేనని చెబుతూ, తన 10 శాతం వాటాను 800 డాలర్ల (సుమారు రూ. 7,200)కు విక్రయించి వెళ్లిపోయాడు. యాపిల్ సంస్థ లోగోను డిజైన్ చేయడం దగ్గర్నుంచి, యూజర్ మాన్యువల్, భాగస్వామ్య ఒప్పందం తదితరాలన్నీ ఆయనే చూశారు. రొనాల్డ్ వెళ్లిపోయిన తరువాత వోజ్నియాక్, స్టీవ్ లే సంస్థను నడిపించారు. ఆనాడు రొనాల్డ్ సంస్థను వీడకపోయివుంటే ఇప్పుడు అదే 10 శాతం వాటా విలువ ఎంతో తెలుసా? దాదాపు 62.93 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 4,19,434 కోట్లు). సిలికాన్ వ్యాలీలోని ఓ గ్యారేజ్ లో ప్రారంభమైన యాపిల్ సంస్థ మార్కెటింగ్ జీనియస్, భవిష్యత్ టెక్ మార్పులను ముందే ఊహించిన స్టీవ్ జాబ్స్, బ్రిలియంట్ ఇంజనీర్ గా, హ్యాకర్ గా నైపుణ్యమున్న వోజ్నియాక్ ల నేతృత్వంలో ఎంతగా ఎదిగిందో అందరికీ తెలిసిందే. ఇక రొనాల్డో నిజ జీవిత గాధ నుంచి మొట్టమొదట తెలుసుకోవాల్సింది ఏంటంటే... "భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు". వాస్తవానికి అప్పట్లో యాపిల్ వ్యాపారంలో ఎంతో రిస్క్ దాగుందని రొనాల్డ్ భావించారట. అప్పటికే కొన్ని వ్యాపారాలు చేసి నష్టపోవడం, భాగస్వామ్య తగాదాలు రావచ్చన్న ఆలోచన, అప్పుల పాలవుతామన్న భయం, తనకన్నా తక్కువ చదువుకున్న వారు భాగస్వాములుగా ఉండటం వంటి కారణాలతో ఆయన సంస్థపై నమ్మకాన్ని పెంచుకోలేక వెళ్లిపోయారు.