: కాసేపట్లో జమ్మలమడుగు నేతలతో చంద్రబాబు సమావేశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరి కాసేపట్లో కడప జిల్లా జమ్మలమడుగు నేతలతో సమావేశం కానున్నారు. వైఎస్సార్సీపీ నుంచి ఈ మధ్యే టీడీపీలో చేరిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డితో అతని చేతిలో ఓటమిపాలైన టీడీపీ నేత రామసుబ్బారెడ్డికి మొదటి నుంచీ వివాదాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఆదినారాయణరెడ్డి చేరికను రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ ఆయన చేరికను ఆపలేకపోయారు. తదనంతర కాలంలో నియోజకవర్గంలో ఇద్దరి మధ్య వివాదాలు పెరిగిపోతున్నాయి. దీంతో ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఎంపీ సీఎం రమేష్ ప్రయత్నించారు. అయితే ఇద్దరి మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉండడంతో పార్టీ అధినేత వద్దే వీరి పంచాయతీ తేల్చాలని ఆయన సూచించారు. ఈ నేపధ్యంలో కాసేపట్లో ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి, సీఎం రమేష్ ముగ్గురూ ముఖ్యమంత్రిని క్యాంపు కార్యాలయంలో కలవనున్నారు. ఈ సందర్భంగా ముగ్గురూ చేయాల్సిన పనులను సీఎం సూచించనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News