: ప్రీమియం చెల్లించకుండానే లభించే 'ఫ్రీ ఇన్స్యూరెన్స్'లివిగో!
దురదృష్టకర ఘటనలు జరిగినప్పుడు నమ్ముకున్న వారికి అండగా నిలుస్తాయన్న ఉద్దేశంతో ఎన్నో రకాల జీవిత బీమాలు, అదనపు రైడర్లను కలుపుకుంటూ ఉంటారు. అయితే, మీరు కొనుగోలు చేసే విమానం టికెట్ నుంచి, ఎల్పీజీ సిలిండర్ వరకూ ఉచితంగా జీవిత బీమాను అందిస్తాయన్న సంగతి మీకు తెలుసా? ఎలాంటి అదనపు డబ్బూ చెల్లించకుండా, ఫ్రీ ఇన్స్యూరెన్స్ ను దగ్గర చేసేవి ఇవే...
గ్యాస్ వినియోగదారులకు: రిజిస్టర్డ్ ఎల్పీజీ లేదా పైప్ ఆధారిత గ్యాస్ వినియోగదారులకు అందరికీ రూ. 5 లక్షల చొప్పున బీమా ఉంది. ఈ బీమా ఖర్చును చమురు మార్కెటింగ్ కంపెనీలే భరిస్తాయి. గ్యాస్ సిలెండర్ల కారణంగా ఏదైనా ప్రమాదం జరిగి మరణం సంభవిస్తే, ఒక్కో వ్యక్తికి రూ. 5 లక్షలు, గాయపడిన పక్షంలో ఒక్కొక్కరికి గరిష్ఠంగా రూ. 1 లక్ష చొప్పున, ఒక్కో ప్రమాద ఘటనకు గరిష్ఠంగా రూ. 15 లక్షల వరకూ బీమా కవరేజ్ ఉంటుంది. అదే ప్రమాదంలో వస్తువులకు నష్టం వాటిల్లినా రూ. 1 లక్ష బీమా లభిస్తుంది.
బ్యాంకు డిపాజిట్లకూ బీమా: మీ బ్యాంకు ఖాతాకు కూడా బీమా ఉన్న సంగతి తెలుసా? డిపాజిట్ లోని డబ్బుకు, దానిపై వచ్చే వడ్డీకి కూడా బ్యాంకు రూ. 1 లక్ష వరకూ బీమా సదుపాయాన్ని అందిస్తుంది. బ్యాంకు తప్పులు, అధికారుల అవకతవకల కారణంగా అన్యాయం జరిగితే, ఈ బీమాను క్లయిమ్ చేసుకోవచ్చు.
కార్పొరేట్ డిపాజిట్ ఇన్స్యూరెన్స్: కొత్త కంపెనీల చట్టం ప్రకారం, ఏదైనా కంపెనీ, డిపాజిట్ల రూపంలో నగదును సమీకరించి, వాటిని తిరిగి చెల్లించలేకపోతే, ప్రతి ఇన్వెస్టరుకూ రూ. 20 వేల వరకూ బీమా వర్తిస్తుంది. అయితే, దీనిపై ఐఆర్డీయే (ఇన్స్యూరెన్స్ రెగ్యులేటర్ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ) నియంత్రణ లేకపోవడంతో ఈ సౌకర్యాన్ని ఇన్వెస్టర్లు పొందలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి.
విమానం టికెట్ తో..: దేశవాళీ విమాన ప్రయాణాల్లో ప్రతి టికెట్ పై రూ. 20 లక్షల ప్రమాద బీమా, రూ. 20 వేల బ్యాగేజి బీమా ఉంది. దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగి మరణం సంభవిస్తే, ప్రయాణికుడి కుటుంబానికి రూ. 20 లక్షల బీమా, బ్యాగ్ పోతే రూ. 20 వేల బీమా అందుతుంది.