: ఎన్నికల అధికారులను తీసుకువెళ్లే కారులో బాంబులు!
పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల అధికారులను తీసుకువెళ్లే కారులో బాంబులు ఉండటాన్ని డ్రైవర్ గుర్తించాడు. వెంటనే చుట్టు పక్కల ఉన్న వాళ్లను అప్రమత్తం చేశాడు. రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు డీసీఆర్ సీ కార్యాలయంగా ఉపయోగిస్తున్న సెంట్రల్ స్కూల్ ఆవరణలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సదరు కారు డ్రైవింగ్ సీటులోని ఒక పాలిథిన్ బ్యాగులో నాలుగు వస్తువులు ఉండటం చూసిన డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. దీంతో, ఆ బ్యాగును బాంబు స్క్వాడ్, పోలీసు సిబ్బంది తనిఖీ చేయగా అందులో నాలుగు బాంబులు ఉన్నట్లు తేలింది.
కాగా, ఈ సంఘటనతో మిగిలిన డ్రైవర్లు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సిబ్బందిని తరలించేందుకు తాము వెళ్లమని మిగిలిన డ్రైవర్ లు అంటున్నారు. తమకు సరైన భద్రత కల్పించాలని వారు కోరారు. దీంతో, ఎన్నికల సిబ్బందిని తరలించడం కొంచెం ఇబ్బందిగా మారింది.