: ఒంటిమిట్ట రామయ్య ... మహిమలకు నెలవయ్యా!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తరువాత, అధికారికంగా శ్రీనామనవమి ఉత్సవాలు ఎక్కడ నిర్వహించాలని ఆలోచించిన ఏపీ ప్రభుత్వం, శతాబ్దాల చరిత్ర, అంతకుమించిన ప్రాశస్త్యం, రామయ్య మహిమలతో కూడిన కథలు ప్రచారంలో ఉన్న కడప జిల్లా ఒంటిమిట్టను ఎంచుకుంది. రామ నవమి వేళ ఒంటిమిట్ట రామయ్య కథలు, ప్రత్యేకతలూ మీకోసం
చంద్రుడికి రామయ్య వరం...
దేశవ్యాప్తంగా సీతారాముల కల్యాణం నవమినాడు జరుగుతుంది. కానీ, ఒంటిమిట్టలో మాత్రం నవమి తరువాత ఐదవనాడు, అంటే పౌర్ణమి రోజున, నిండు పున్నమి వెలుగుల్లో జరుగుతుంది. ఇక్కడ తన కల్యాణం పౌర్ణమి రోజునే జరుగుతుందని స్వయంగా రామయ్య తండ్రే చంద్రుడికి వరమిచ్చాడని ప్రతీతి.
700 ఏళ్ల క్రితమే...
ఒంటిమిట్ట రామాలయం భద్రాచలం రామాలయం కన్నా ముందే ఉంది. దాదాపు 700 సంవత్సరాల క్రితమే ఆలయం నిర్మించినట్టు శాసనాలు ఉన్నాయి. హరిహరరాయలు, బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన తరువాత ఉదయగిరి రాజధానిగా ఓ సంస్థానం ఏర్పాటైంది. 1355 వరకూ ఉదయగిరి సంస్థానం కంపరాయల పాలనలో ఉంది. ఆయన ఒంటిమిట్ట ప్రాంతానికి పర్యటనగా వచ్చిన వేళ, అక్కడి కొండలు, కోనలు, వృథాగా పోతున్న పెన్నా నది వరదనీటిని చూసి, అక్కడే ఓ చెరువు తవ్వించాలని భావించి, బోయ వీరులుగా పేరున్న ఒంటెడు, మిట్టడులకు పనులు అప్పగించాడు. అదే సమయంలో ఇక్కడి ఓ గుట్టపై జాంబవంతుడు ప్రతిష్ఠించిన సీతా రామ లక్షణుల శిల ఉందని కంపరాయలుకు చెప్పగా, గుడి కట్టించేందుకు పూనుకున్న ఆయన, ఆ పనులను కూడా వారికే అప్పగించారని, ఆపై కాలక్రమేణా ఈ ప్రాంతం ఒంటిమిట్టగా మారిందని చెబుతారు.
చరిత్రంతా నిక్షిప్తం...
ఈ ఆలయానికి సంబంధించిన చరిత్రను కైఫీయత్తుల్లో శాసనాల రూపంలో నిక్షిప్త పరిచారు. 1875లో కడప జిల్లా మాన్యువల్ / జేడీబీ గ్రిబుల్ లో గండికోటలో లభించిన తెలుగు శాసనానికి ఆంగ్ల అనువాదంలో బుక్కరాయలు, ఒంటిమిట్ట, రామాలయంలకు సంబంధించిన పలు అంశాలున్నాయి. ఒంటిమిట్టకు సంబంధించి ఇటువంటి ఆధారాలు ఎన్నో లభించాయి.
పిల్లాడి ఆకలితీర్చిన సీతమ్మ తల్లి...
శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అయ్యలరాజు రామభద్రుడి చిన్నతనంలో స్వయంగా సీతమ్మ తల్లే ఆకలి తీర్చిందట. 1550 ప్రాంతంలో పది నెలల వయసులో ఉన్న వేళ, ఒంటిమిట్ట కోదండ రామాలయ బ్రహ్మోత్సవాల్లో తప్పిపోయాడట. లోపల బాలుడిని గమనించని అర్చకులు గుడికి తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. మరుసటి రోజు అర్చకులు తలుపులు తీయగా, బుగ్గలకు పాలు అంటుకుని ఉన్న బాలుడు ఆనందంగా కనిపించాడు. అది చూసిన అర్చకులు అచ్చెరువొంది, ఆ సీతమ్మ తల్లే పిల్లాడిని గుండెలకు హత్తుకుని పాలిచ్చి, ఆకలి తీర్చిందని అన్నారు. ఈ పిల్లాడే పెద్దవాడైన తరువాత 'శ్రీరామాభ్యుదయం' కావ్యాన్ని రచించాడు.
పిలిస్తే, పలికిన రామయ్య
ఇక మరో 100 సంవత్సరాల తరువాత, అంటే 1640 ప్రాంతంలో కడపను పాలించిన అబ్దుల్ నబీఖాన్ కు ప్రతినిధిగా ఇమాంబేగ్ ఈ ప్రాంతంలో పనిచేస్తుండేవాడు. ఓసారి ఆయన ఒంటిమిట్ట రామాలయానికి వచ్చి మీ దేవుడు పలుకుతాడా? అని ప్రశ్నించగా, మనస్ఫూర్తిగా పిలిస్తే తప్పక పలుకుతాడని భక్తులు చెప్పారట. దీంతో ఆలయం తలుపు వద్దకు వెళ్లిన ఆయన రఘురాముడిని మూడు సార్లు పిలువగా 'ఓ...' అని బదులు వినిపించినట్టు చెబుతారు. దీంతో రామయ్యకు భక్తుడిగా మారిపోయిన ఇమాంబేగ్, ఆలయ దక్షిణాన ఓ బావిని తవ్వించాడట. ఇది ఇప్పటికీ ఉంది.
మాల ఓబన్న ఉన్న వైపు తిరిగిన విగ్రహాలు
ఇది ఓ 200 సంవత్సరాల క్రితం జరిగిన ఘటన. ఒంటిమిట్టకు పక్కనే ఉండే మాలకాటిపల్లెలోని మాల ఓబన్న చిన్నతనం నుంచే పాటలు బాగా పాడుతుండేవాడు. రామకీర్తనలు పాడుకుంటూ, గుడి దగ్గరే ఉండేవాడు. ఓబన్న అంటరానివాడంటూ, ఆలయం నుంచి గెంటివేయగా, సమీపంలోని చెరువు కట్ట వద్ద పాటలు పాడటం మొదలు పెట్టాడట. మరుసటి రోజు పూజారులు ఆలయ తలుపులు తీయగా, విచిత్రంగా రామయ్య విగ్రహం ఓబన్న కూర్చున్న వైపునకు తిరిగి వుందట. ఆయన పాటలను వినేందుకే రాముడు ఆవైపునకు తిరిగాడని తెలుసుకున్న ప్రజలు, ఆయన్ను తిరిగి ఆలయంలోకి తెచ్చిన తరువాతనే విగ్రహం యథాస్థానానికి వచ్చిందని ఓ యథార్థగాధను ఇక్కడి ప్రజలు చెప్పుకుంటారు.
పోతన రాయలేకపోయిన వేళ...
ఆంధ్ర మహా భాగవతాన్ని తెలుగులో రచించిన బమ్మెర పోతన, దాన్ని ఒంటిమిట్ట కోదండరామునికే అంకితమిచ్చారు. ఆయనకు ఇక్కడో ఇల్లు, భూమి కూడా ఉండేవి. గజేంద్రమోక్షంలోని "అలవైకుంఠపురంబులో నగరిలో నా మూలసౌధంబు దాఫల..." పద్యం రాస్తున్న వేళ, పోతన దాన్ని సరిగ్గా పూర్తి చేయలేకపోతే స్వయంగా రాముడే వచ్చి దాన్ని పూరించాడట.
ఇన్ని వింతలు, విశేషాలు ఉన్న ఒంటిమిట్ట రామయ్య బ్రహ్మోత్సవాలు ప్రభుత్వ లాంఛనాల మధ్య నేటి నుంచి వైభవంగా జరుగుతున్నాయి.