: కేసీఆర్ గారూ... ఇటువంటి పనులు చేయద్దండి: టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు
హైదరాబాద్ లోని ఎన్టీఆర్ గార్డెన్స్ ను ఆనుకుని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం తగదని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. అంతకంటే మంచి ప్రదేశంలో, ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. కేసీఆర్ కు రాజకీయంగా జన్మనిచ్చిన ఎన్టీఆర్ స్మారకాన్ని చెరిపేయడం ఎంతవరకు సబబు? అని ప్రశ్నించారు.
‘అంబేద్కర్ 125 వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ఆ తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానన్నారు. ఈ విషయంలో ఎటువంటి వివాదం లేదు. అయితే, ఈ విగ్రహం ఏర్పాటు చేసేందుకు గాను, ఎన్టీఆర్ గార్డెన్ ను డిస్ట్రబ్ చేస్తున్నారు. ఇది మంచిపద్ధతి కాదు. ఈ విగ్రహాన్ని పెట్టాలంటే నెక్లెస్ రోడ్ లో కల్యాణ మండపాలను కానీ, హోటళ్లను కానీ, చాట్ హౌస్ లను కానీ తీసేసి ఆ స్థలాల్లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. సంజీవయ్య పార్క్ పక్కన చాలా ఖాళీ స్థలం ఉంది. కేసీఆర్ కొడుకు, కూతురు, మేనల్లుడి పేర్లు మాత్రమే ఉండాలా? ఇక ఎవరి పేర్లు ఉండకూడదా? కేసీఆర్ కంటే నిజామే మేలు. కేసీఆర్ గారూ!, ఇది మంచి పద్ధతి కాదు.. ఇటువంటి పనులు చేయద్దండి, రాజకీయ భిక్ష పెట్టిన నాయకుడిని మర్చిపోవద్దండి’ అని ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు.