: ఐపీఎల్‌లో పాల్గొంటున్న జట్లకు కోచింగ్ ఇచ్చిన వారికి పాక్ కోచ్‌గా అవకాశం..!
టీమిండియా కోసం ప్రస్తుతం కొత్త కోచ్‌ను అన్వేషిస్తోన్న విషయం తెలిసిందే. అయితే, దాయాది పాకిస్థాన్ క్రికెట్ కూడా ఇప్పుడు ఇదే పనిలో పడింది. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్‌కప్ పోరులో ప్రాథమిక దశలోనే వెనుదిరిగిన పాకిస్థాన్ ఓటమికి తననే పూర్తిగా బాధ్యుణ్ని చేస్తున్నారంటూ ఆ జట్టు కోచ్, పాక్ జట్టు మాజీ ఆటగాడు వకార్ యూనిస్ రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో పాక్ జట్టుకు కోచ్‌గా ఎవరిని నియమించాలనే అంశంపై క్రికెట్ పాకిస్థాన్ దృష్టి సారించింది. అయితే, ప్రస్తుతం కొనసాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాల్గొంటున్న జట్లకు కోచ్‌లుగా పనిచేసిన వారిలో ఒకరిని పాక్ క్రికెట్ జట్టు కోచ్‌గా నియమించవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం భారత్‌లో ఉన్న పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ ఐపీఎల్ కోచ్‌లతో ఈ అంశంపై చర్చిస్తారని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ షహరియార్ ఖాన్ పేర్కొన్నారు.