: వైజాగ్ ఎప్పుడొచ్చినా పులకించిపోతాను...వైజాగ్ లో ఇల్లు కట్టుకుంటాను: చిరంజీవి
వైజాగ్ ఎప్పుడొచ్చినా పులకించిపోతానని చిరంజీవి తెలిపారు. తన చిన్న నాటి నుంచి, సినిమాల్లోకి వచ్చిన తరువాత, రాజకీయాల్లోకి వచ్చిన తరువాత తాను ఎక్కువ సార్లు వెళ్లిన ఊరేదైనా ఉందంటే అది వైజాగేనని చిరంజీవి చెప్పారు. విశాఖ వాసుల ప్రేమాభిమానాలు తనను ఇక్కడికి ఎక్కువ సార్లు రప్పిస్తుంటాయని ఆయన తెలిపారు. విశాఖ తీరంలో ఆర్కే బీచ్ ను చూస్తే 'యూరేకా శాఖా మీకా'కు వేసిన స్టెప్పులు, 'ఇందుగమన చంద్రవదన', 'బంగారు కోడిపెట్ట', 'చంటబ్బాయి', 'ఆరాధన', 'శుభలేఖ' ఇలా ఎన్నో సినిమాల్లో తిరుగులేని మరపురాని అనుభూతులు ఉన్నాయని చిరంజీవి చెప్పారు. ఈ స్థలం ఎంత ప్రశాంతంగా, అందంగా ఉంటుందో అంతకంటే గొప్ప మనుషులు వైజాగ్ లో ఉంటారని చిరంజీవి చెప్పారు. తనకు రిటైర్ మెంట్ లైఫ్ ఉంటే వైజాగ్ లో స్థిరపడతానని చిరంజీవి తెలిపారు. వైజాగ్ లో ఉష్ణోగ్రత తక్కువ ఉంటుందని ఆయన అన్నారు. మండు వేసవిలో కూడా బాగుండడానికి కారణం, ఇక్కడి ప్రజల్లో నెలకొన్న శాంతి కాముకత అని ఆయన చెప్పారు. గీతా ఆర్ట్స్ అంటే అరవింద్ అని ఆయన అన్నారు. తనతో సినిమాలు తీసినప్పుడు చూపించిన ఆసక్తి ఇప్పటికీ ఉండడం విశేషం. వయసు పెరిగితే అప్ డేట్ చేసుకోవడం కష్టం, అలాంటిది కాలంతో పరుగెత్తుతూ, పరిస్థితులను అవగతం చేసుకుంటూ విజయవంతమైన సినిమాలు నిర్మిస్తున్నారని ఆయన ప్రశంసించారు. రామ్ చరణ్ ఎంతో బన్నీ అంత అని చిరంజీవి చెప్పారు. వాడిని చూస్తున్నా, వాడి విజన్ చూస్తున్నా చాలా గర్వంగా ఉంటుందని చిరంజీవి తెలిపారు. కార్టూన్ క్యారెక్టర్లను ఇమిటేట్ చేస్తూ, డాడీలో ఓ క్యారెక్టర్ క్రియేట్ చేసి నటింపజేయడం జరిగింది. బన్నీ సినిమాల్లో వచ్చేందుకు బీజం వేసిన వాడిని తానని ఆయన గుర్తు చేసుకున్నారు. బన్నీ గురించి చెప్పిన ముఖ్యుల్లో రాఘవేంద్రరావుతో చెప్పానని ఆయన తెలిపారు. మనం అవకాశం కల్పించగలం తప్ప... అభిమానులతో శభాష్ అనిపించలేమని ఆయన చెప్పారు. మెగా హీరోలందరికీ కష్టపడాలని చెబుతుంటానని ఆయన తెలిపారు. వారు దానిని ఆచరిస్తున్నారని చిరంజీవి చెప్పారు. బన్నీ ప్రతి రోజూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాడు, జిమ్ లో కష్టపడతాడని ఆయన తెలిపారు. బన్నీని చూసి గర్వపడుతున్నానని చెప్పడానికి సంతోషపడుతున్నానని ఆయన కితాబునిచ్చారు. బన్నీలో హుందాతనం పెరిగిందని ఆయన చెప్పారు. బన్నీ నుంచి సరైన పెర్ఫార్మెన్స్ చూడలేదని భావిస్తున్న తరుణంలో గోనగన్నారెడ్డిగా అలరించి తనకు సంతోషం కలిగించాడని ఆయన తెలిపారు. సన్నాఫ్ సత్యమూర్తిలో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చూపించాడు. రేసు గుర్రంలో మళ్లీ అల్లరి చేశాడని ఆయన చెప్పారు. పవన్, నాగబాబులా శ్రీకాంత్ కూడా తనకు తమ్ముడని చిరంజీవి తెలిపారు. రకుల్ చాలా ప్రొఫెషనల్ అని ఆయన కితాబునిచ్చారు. రకుల్ ను అభినందిస్తున్నానని ఆయన చెప్పారు. మాస్, సెంటిమెంట్, డ్రామాను, యాక్షన్ సీక్వెన్స్ ను పట్టుసడలకుండా తీర్చిదిద్దే సత్తా బోయపాటిలో ఉందని ఆయన తెలిపారు. సింహా, లెజెండ్ కథలు తనకు చెప్పేవాడని, ఆయన అన్నారు. సరైనోడుకి గో ఏ హెడ్ అని చెప్పానని ఆయన తెలిపారు.