: ఉగాది పచ్చడిలో జీవితానికి అవసరమైన సందేశం ఉంది: చంద్రబాబు
తెలుగు ప్రజలు ఎంతో గొప్పగా జరుపుకునే ఉగాది పండగలో ఎంతో విశిష్టత ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. రాజ్ భవన్ లో గవర్నర్ నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉగాది పచ్చడిలో జీవితంలో సంభవించే భావోద్వేగాల్లా, ఎన్నో రుచులు ఉంటాయని అన్నారు. ఉగాది అంటే పంచాగ శ్రవణం ఉంటుందని, ప్రతి తెలుగు వారు పంచాగ శ్రవణం విని భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారని ఆయన తెలిపారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురిసి వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. గవర్నర్ తెలుగు సంప్రదాయవాదిలా కనిపించడాన్ని చంద్రబాబు అభినందించారు. తెలుగు నేలకి ఒక రోజు ముందుగానే గవర్నర్ ఉగాది తీసుకువచ్చారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబును గవర్నర్ నరసింహన్ దుశ్శాలువతో సత్కరించారు.