: కాళ్లబేరానికొచ్చిన విజయ్ మాల్యా!... సెప్టెంబర్ లోగా రూ.4 వేల కోట్లు చెల్లిస్తానని ప్రతిపాదన
వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని 17 బ్యాంకులకు టోకరా ఇచ్చి లండన్ వెళ్లిపోయిన మాజీ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఎట్టకేలకు దారికి వచ్చారు. జాతీయ, ప్రాంతీయ వార్తా సంస్థల్లో వరుస కథనాలు రావడంతో బాటు, కేంద్ర ప్రభుత్వం కూడా ఘాటుగా స్పందించడంతో మాల్యా దారికి రాక తప్పలేదు. ఈ మేరకు మాల్యా నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బ్యాంకులు ఇచ్చిన రుణాలను తప్పకుండా తీరుస్తానని పిటిషన్ దాఖలు చేశారు. మాల్యా దాఖలు చేసిన పిటిషన్ పై కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కురియన్ నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ ముందు జరిగిన ఈ విచారణలో మాల్యా తరఫు న్యాయవాది కీలక ప్రతిపాదన చేశారు. బ్యాంకులు ఇచ్చిన రుణాలను తన క్లెయింట్ తీరుస్తారని మాల్యా తరఫు న్యాయవాది తెలిపారు. ఇందులో భాగంగా తొలి విడతగా రూ.4 వేల కోట్లను చెల్లించేందుకు మాల్యా సిద్ధంగా ఉన్నారన్నారు. సెప్టెంబర్ లోగా ఈ చెల్లింపులను పూర్తి చేస్తారన్నారు. ఈ మేరకు రుణాలిచ్చిన బ్యాంకుల కన్సార్టియంతో మాల్యా ఇప్పటికే రెండు సార్లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారని కూడా చెప్పారు. మాల్యా లాయర్ వాదనలు విన్న తర్వాత ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని జస్టిస్ కురియన్ బ్యాంకుల కన్సార్టియానికి నోటీసులు జారీ చేశారు. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను వచ్చే నెల (ఏప్రిల్) 7కు వాయిదా వేశారు.