: కృష్ణపట్నం టూ బంగ్లా కార్గో జర్నీ ఇక 5 రోజులే!... అమల్లోకి వచ్చిన చారిత్రక ఒప్పందం


బంగ్లాదేశ్, ఏపీలోని కృష్ణపట్నం ఓడరేవుల మధ్య కార్గో రవాణాకు సంబంధించి నిన్న ఓ కీలక అడుగు పడింది. దాదాపు 42 ఏళ్ల క్రితం భారత్, బంగ్లాదేశ్ ల మధ్య కుదిరిన చారిత్రక ఒప్పందం కార్యరూపం దాల్చింది. బంగ్లాదేశ్ లోని ఐసీటీ పన్ గాన్ ఓడరేవు, కృష్ణపట్నం ఓడరేవుల మధ్య నేరుగా కార్గో రవాణా నిన్న లాంఛనంగా ప్రారంభమైంది. ఇప్పటిదాకా కృష్ణపట్నం నుంచి బంగ్లాదేశ్ కు కార్గో వెళ్లాలంటే... శ్రీలంక, సింగపూర్ ల మీదుగా వెళ్లాల్సిందే. ఇందుకు ఏకంగా 25 రోజుల నుంచి 30 రోజుల సమయం పడుతోంది. అంతేకాక సుదీర్ఘ ప్రయాణంలో రవాణా వ్యయం కూడా తడిసిమోపెడవుతోంది. ఈ క్రమంలో 1974లో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ బంగ్లాదేశ్ తో కీలక ఒప్పందం చేసుకున్నారు. ఇరు దేశాల ఓడ రేవుల మధ్య నేరుగా ప్రయాణించేందుకు అనుమతి ఇచ్చే ఈ ఒప్పందం ఆ తర్వాత అటకెక్కింది. తాజాగా భారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... ఈ పాత ఒప్పందానికి బూజు దులిపారు. గతసంవత్సరం బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా ఈ ఒప్పందంపై ఆ దేశ ప్రధానితో చర్చించారు. ఇరువురు ప్రధానుల మధ్య ఈ ఒప్పందం అమలుకు సంబంధించి అంగీకారం కుదిరింది. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం బంగ్లా ఓడ రేవు నుంచి బయలుదేరిన ‘నీపా పరిబహాన్’ సంస్థకు చెందిన ఎంవీ హార్బర్ -1 నౌక నిన్న కృష్ణపట్నం ఓడరేవుకు చేరింది. సదరు ఓడలో పత్తి బేళ్ల లోడింగ్ ను జిల్లా కలెక్టర్ జానకి, కృష్ణపట్నం ఓడరేవు సీఈఓ అనిల్ యెండ్లూరి, బంగ్లా నుంచి వచ్చిన ఎంపీ నూర్ ఏ అలామ్ చౌదురి లాంఛనంగా ప్రారంభించారు. ఈ నౌక నేడు కృష్ణపట్నం నుంచి బయలుదేరి ఐదు రోజుల్లోగా అంటే... ఏప్రిల్ 3లోగా బంగ్లా చేరనుంది. భారత్ లో విరివిగా పండుతున్న పత్తిని బంగ్లాదేశ్ దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ కొత్త సముద్ర మార్గం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఇకపై తక్కువ ఖర్చుతోనే బంగ్లాకు పత్తిని ఎగుమతి చేసే వీలుంది. అంతేకాక దేశంలోని ఇతర ఓడరేవుల ద్వారా కూడా బంగ్లాకు సరుకుల రవాణాలో దూరం తగ్గడమే కాక ఖర్చు కూడా భారీగా తగ్గనుంది. వెరసి ఇరు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలు జోరందుకోనున్నాయి.

  • Loading...

More Telugu News