: అందుకే జగన్ అగ్రిగోల్డ్ సమస్యను లేవనెత్తారు: విష్ణుకుమార్ రాజు
బ్రాండిక్స్ లంకా లిమిటెడ్ సమస్య గురించి చర్చించకూడదని జగన్ అగ్రిగోల్డ్ సమస్యను లేవనెత్తారని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, వైఎస్ హయాంలో బ్రాండిక్స్ సంస్థకు విలువైన భూమిని లీజుకు అప్పగించారని మండిపడ్డారు. జూలై 2005లో 1000 ఎకరాలను రూ. 25 వేలకే 25 సంవత్సరాలకు లీజుకు ఇచ్చారని, దీని వెనుక పెద్ద కుంభకోణం దాగుందని ఆయన ఆరోపించారు. దీనిపై తాను ప్రశ్నించినందునే, బ్రాండిక్స్ ప్రస్తావన సభలో తేకుండా చూసేందుకు వైకాపా అడ్డుతగులుతోందని విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆ భూములను బ్రాండిక్స్ లక్షలాది రూపాయలకు సబ్ లీజులకు ఇచ్చుకుని కోట్లాది రూపాయలు సంపాదించిందని ఆయన తెలిపారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బ్రాండిక్స్ సంస్థలో పని చేస్తున్న మహిళలు కూడా వేధింపులకు గురవుతున్నారని, ఆ సంస్థ పరిసరాల్లో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.