: హైదరాబాద్ సెంట్రల్, జవహర్ లాల్ నెహ్రూ వర్శిటీల్లో జీహాదీలు: జైట్లీ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ, జవహర్ లాల్ నెహ్రూ వర్శిటీల్లో జీహాదీలు ఉన్నారని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జేఎన్యూలో ఓ వర్గం వారు వామపక్ష అతివాద భావజాలాన్ని వంటబట్టించుకుని నిరసనలు తెలుపుతుంటే, ముఖాలకు మాస్కులను ధరించిన కొద్ది మంది జీహాదీలు వారికి మద్దతుగా నిలిచారని ఆయన అన్నారు. అందువల్లే ఫిబ్రవరి 9న దేశ వ్యతిరేక నినాదాలు వినిపించాయని తెలిపారు. హెచ్సీయూలో రోహిత్ వేముల ఆత్మహత్య తరువాత, అంబేద్కర్ పేరును ఓ వర్గం వారు తమ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ రెండు వర్శిటీల్లో జరిగిన ఘటనలపై దేశ ప్రజలకు ఓ అభిప్రాయం ఏర్పడిందని, వీటిపై మరింత చర్చ బీజేపీ తరఫున చేపట్టబోమని అన్నారు. అధికారంలో ఉన్న తమకు రాజకీయ ప్రయోజనాలు అవసరం లేదని, కాంగ్రెస్ పార్టీ కావాలనే రాజకీయం చేస్తోందని ఆరోపించారు. ఈ దేశంలోని ఓ అతిచిన్న వర్గం, వర్శిటీల్లో జరుగుతున్న ఘటనలను తమకు అనుకూలంగా మలచుకుని లబ్ధి పొందాలని చూస్తున్నాయని జైట్లీ వ్యాఖ్యానించారు. దేశప్రజలంతా భారత్ మాతా కీ జై అని తప్పనిసరిగా అనాలని తామెన్నడూ చెప్పలేదని వివరించారు. అయితే, ఎవరైనా 'నేను అనను' అంటే మాత్రం అది వివాదమవుతుందని చెప్పుకొచ్చారు.

More Telugu News