: వైసీపీ రాయబారం ఫలించలేదు!... తోడల్లుడితో కలిసి యనమలతో జ్యోతుల భేటీ!

నిన్న ఏపీ రాజకీయాల్లో ఎడతెగని సస్పెన్స్ కొనసాగింది. తెల్లవారుజాము నుంచి మొదలైన సస్పెన్స్ రాత్రి పొద్దుపోయేదాకా కొనసాగింది. వైసీపీ కీలక నేత, ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ పార్టీ మారుతున్నారంటూ వచ్చిన వార్తలతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. జ్యోతులతో చర్చలు జరిపి, పార్టీ మారే యత్నాన్ని నిలువరించాలని ఆయన తన సన్నిహితులు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, విజయసాయిరెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిలను పురమాయించారు. జగన్ సూచనతో నిన్న తెల్లవారుజామున 4 గంటలకే చెవిరెడ్డి... జ్యోతుల సొంతూరుకు చేరారు. ఈ భేటీ ఫలితమివ్వకపోగా, జ్యోతుల అనుచరులను ఆగ్రహావేశాలకు గురి చేసింది. ఈ విషయం తెలుసుకున్న ద్వారంపూడి కూడా జ్యోతుల వద్దకు వెళ్లారు. అయినా జ్యోతుల ససేమిరా అన్నారు. ఆ తర్వాత విజయసాయిరెడ్డి ఫోనందుకున్నారు. అయితే ఫోన్ లోనే జ్యోతుల అడిగిన ప్రశ్నలకు సాయిరెడ్డి వద్ద సమాధానాలు లేకపోయినట్లు సమాచారం. ఆ తర్వాత హైదరాబాదుకు వచ్చేసిన జ్యోతుల తన తోడల్లుడు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుతో కలిసి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడితో భేటీ అయ్యారు. పిఠాపురం ఎమ్మెల్యే వర్మ వారిద్దరినీ యనమల వద్దకు తీసుకెళ్లారు. దాదాపు గంటన్నరకు పైగా కొనసాగిన ఈ భేటీలో జ్యోతుల పార్టీ మారేందుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. మీడియా కంటబడకుండా యనమల ఇంటి వెనుక వైపు ద్వారం గూండా లోపలికి వెళ్లిన జ్యోతుల, వరుపుల... అదే మార్గంలో బయటకు వచ్చారు.

More Telugu News