: ఇది ఆరంభం మాత్రమే... ఇంకా చాలా ఉంది!: బెల్జియంను మరోసారి హెచ్చరించిన ఐఎస్ఐఎస్
గత వారం బాంబుదాడులతో దద్దరిల్లిన బెల్జియంను ఐఎస్ఐఎస్ మరోసారి హెచ్చరించింది. ఇరాక్, సిరియాల్లో ఉన్న విదేశీ సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో మరిన్ని దారుణాలు చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ ఐఎస్ఐఎస్ రెండు వీడియోలను విడుదల చేసినట్టు బెల్జియం రేడియో ఆర్టీబీఎఫ్ తెలిపింది. ఈ వీడియోలను బెల్జియం వార్తాపత్రిక లి సొయిర్ కు పంపారు.
'సిరియా, ఇరాక్ లలో మోహరించిన విమానాలు, సైనికులను ఉపసంహరించుకోవాలని మిత్ర దేశాలకు చెప్పండి, లేదా బ్రస్సెల్స్ లో మీరు చూసింది ఆరంభమే...ఇంకా చాలా చూస్తారు' అంటూ ఆ వీడియోలలో బెదిరించారు. తరువాత తాము చేసే దాడి మరింత భయంకరంగా ఉంటుందని తెలిపారు. గతేడాది పారిస్ దాడుల సందర్భంగా తాము చేసిన హెచ్చరికలు గుర్తు చేసుకోవాలని సూచించారు. పారిస్, బ్రస్సెల్స్ పై దాడి చేస్తామని చెప్పామని, చెప్పినట్టే చేశామని అన్నారు. తమకు చాలా లక్ష్యాలు ఉన్నాయని వీడియోలో ఐఎస్ఐఎస్ తీవ్రవాది వెల్లడించాడు. 'ఆయా దేశాల విమానాలు, సైనికులు వెనక్కి వెళ్లిపోతే మీరు ప్రశాంతంగా జీవిస్తారు. లేదా పీడకల చూస్తారు' అంటూ ఐఎస్ఐఎస్ హెచ్చరించింది.