: చంద్రబాబు! విభజన చట్టంలో ఏముంది...మీరేం చేస్తున్నారు?: తులసిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాయలఫకీర్ వేషాలు మానుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తులసిరెడ్డి హెచ్చరించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో రాజ్ భవన్, సచివాలయం, శాసనమండలి, ముఖ్యమంత్రి కార్యాలయం, హైకోర్టు, పరిపాలనాపరమైన భవనాలు, రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలను కేంద్రమే నిర్మిస్తుందని స్పష్టంగా పేర్కొందని అన్నారు. విభజన చట్టంలో ఉన్నదానిని వదిలేసి, మీరు చేస్తున్నదేమిటి? అంటూ ఆయన ప్రశ్నించారు.
'వీటన్నింటినీ పక్కన పడేసిన చంద్రబాబు సింగపూర్ కంపెనీతో మాస్టర్ ప్లాన్ అంటూ 15 కోట్ల రూపాయలు చెల్లించారు. భవనాల డిజైన్ల కోసం జపాన్ కి చెందిన మాకీ కంపెనీకి 97.50 లక్షల రూపాయలు చెల్లించారు. రాజధానికి నిధుల సేకరణ ఎలా చేయాలన్న సలహా ఇచ్చినందుకు 112 కోట్ల రూపాయలు చెల్లించేందుకు సన్నాహాలు చేస్తున్నారు' అంటూ విమర్శించారు.
ఒక రాజధానికి భూమిపూజ, శంకుస్థాపన, ఇతర పూజలు, భూసేకరణ... అంటూ చంద్రబాబు టక్కుటమార గజకర్ణగోకర్ణ విద్యలన్నీ ప్రదర్శిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి చీప్ ట్రిక్స్ కు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు.